కాస్ట్ అకౌంటింగ్‌తో మేకిన్ ఇండియాకు జోష్ | Josh mekin India with Cost Accounting | Sakshi
Sakshi News home page

కాస్ట్ అకౌంటింగ్‌తో మేకిన్ ఇండియాకు జోష్

Published Thu, Jan 15 2015 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 7:43 PM

కాస్ట్ అకౌంటింగ్‌తో మేకిన్ ఇండియాకు జోష్

కాస్ట్ అకౌంటింగ్‌తో మేకిన్ ఇండియాకు జోష్

‘సాక్షి’ ఇంటర్వ్యూ  ఐసీఏఐ ప్రెసిడెంట్ దుర్గా ప్రసాద్
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులను అందించినప్పుడే ఈ పోటీ ప్రపంచంలో నిలబడగలం. అనవసర వ్యయాలను తగ్గించుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. మేకిన్ ఇండియా కార్యక్రమంతో చైనాతో పోటీ పడాలంటే కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ ్సను అమలు చేయాలంటున్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ప్రెసిడెంట్ ఎ.ఎస్. దుర్గా ప్రసాద్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ...

కొత్త కంపెనీల చట్టంలో కాస్ట్ అకౌంటెంట్స్ పాత్రపై..
.
కొంతకాలంగా కాస్ట్ అకౌంటింగ్‌పై ఉన్న అనిశ్చితికి తెరపడింది. ప్రపంచంలోనే ప్రత్యేకత కలిగిన ఇండియా కాస్ట్ అకౌంటింగ్ విధానానికి కొత్త కంపెనీల చట్టం 2013లో ప్రాధాన్యత తగ్గించిన మాట వాస్తవమే. మొన్నటి చట్ట సవరణ తర్వాత తిరిగి ప్రాధాన్యత కల్పించడం జరిగింది. కొత్తగా కాస్ట్ అకౌంటింగ్ పరిధిలోకి హాస్పిటల్స్, విద్యా సంస్థలను తీసుకొచ్చినా ఆటోమొబైల్, ఆహార తయారీ, విత్తన తయారీ వంటి కొన్ని కీలక రంగాలను తప్పించారు.

చట్ట సవరణలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఏమిటి?

కాస్ట్ ఆడిటింగ్ నిర్వహించాల్సిన రంగాలను రెగ్యులేటెడ్, నాన్ రెగ్యులేటెడ్‌గా విభజించారు. రెగ్యులేటెడ్ విభాగంలోకి వచ్చే  టెలికమ్యూనికేషన్ సర్వీసెస్, విద్యుత్ పంపిణీ సంస్థలు, పెట్రోలియం, ఔషధాలు, ఫార్మా, ఇండస్ట్రీ ఆల్కహాల్ కంపెనీల వార్షిక టర్నోవర్ రూ. 50 కోట్లు దాటితే, అదే నాన్ రెగ్యులేటెడ్ కంపెనీలు అయితే రూ. 100 కోట్ల టర్నోవర్ దాటితే విధిగా కాస్ట్ ఆడిటింగ్ నిర్వహించాలి. ఇది కాకుండా రూ. 35 కోట్ల టర్నోవర్ దాటిన ప్రతీ సంస్థ విధిగా కాస్ట్ అకౌంటింగ్ బుక్స్‌ను నిర్వహిస్తే సరిపోతుంది. కానీ ట్రస్టుల ద్వారా నిర్వహించే హాస్పిటల్స్, విద్యా సంస్థలను మాత్రమే కాస్టింగ్ పరిధిలోకి తీసుకొచ్చారు. అలాగే ఎగుమతుల నుంచే ఆదాయంలో 70 శాతం ఆర్జించే ఫార్మా కంపెనీలను కాస్టింగ్ నుంచి తప్పించారు. అందుబాటు ధరలో వైద్యం, విద్య లభించాలంటే వ్యయ నియంత్రణ చాలా కీలకం. కాస్టింగ్‌లోకి విద్య, వైద్య రంగాలను పూర్తిగా తీసుకురావాలనే అంశంపై త్వరలోనే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కలవనున్నాం.
 
ధరల విషయంలో అంతర్జాతీయ కంపెనీలతో పోటీ..!


కాస్ట్ కాంపిటీటివ్‌నెస్‌లో ఇండియా చాలా వెనుకబడి ఉంది. మొదటి 60 దేశాలను తీసుకుంటే మనం ఎక్కడో 48 స్థానంలో ఉన్నాం. అనవసర వ్యయాలను తగ్గించుకొని అతి తక్కువ ధరలకే వస్తువులను అందించగలిగినప్పుడే విదేశాలతో మనం పోటీ పడగలం. ఈ దిశలో కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అమలును తప్పనిసరి చేస్తూ చట్ట సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం.
 
రానున్న కాలంలో ఐసీఏఐ కార్యకలాపాలు...

తొలిసారిగా కీలకమైన వైద్యం, విద్యా రంగాల్లో కొన్ని విభాగాలను ఈ పరిధిలోకి తీసుకురావడంతో అందుబాటు ధరలో వైద్యం, విద్య లభించే విధంగా వీటికి సంబంధించిన మాన్యువల్స్‌ను త్వరలోనే విడుదల చేయనున్నాం.  ఇన్‌ఫ్రా రంగంలో కీలకమైన పీపీపీ ప్రాజెక్టులు, సౌర విద్యుత్ రంగాలపై  శ్వేతపత్రాలను తయారు చేస్తున్నాం.  చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాం. ఇందుకోసం అసోచామ్‌తో కలిసి 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా వర్చువల్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. వ్యయ నియంత్రణతో పాటు, ట్యాక్సేషన్, ఇతర సేవలను ఈ కేంద్రం ద్వారా అందించనున్నాం. కొత్త నిబంధనలపై మా సభ్యులకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా సుమారు 50-60 శిక్షణా తరగతులను నిర్వహించనున్నాం.  వ్యవసాయం, ఫార్మాలపై జాతీయ సదస్సులను నిర్వహించనున్నాం.

కాస్ట్ అకౌంటెంట్స్‌కు డిమాండ్ ఏవిధంగా ఉంది?

గత రెండు ఏళ్ళతో పోలిస్తే ఈ ఏడాది ఉద్యోగాల్లో 20 శాతం వృద్ధి నమోదయ్యింది. అలాగే ప్రాంగణ నియామకాల్లో సగటును రూ. 4 లక్షలు, గరిష్టంగా రూ. 9.5 లక్షలు జీతాలు లభించాయి. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఐటీ కంపెనీలతో పాటు ఆస్ట్రేలి యా, అమెరికా, కెనడాల వంటి పలు దేశాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. గతంలో ఐసీడబ్ల్యూఏఐగా ఉన్న పేరును మార్చడంపై ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కదా?

రెండు సంస్థల పేర్లు ఒకే విధంగా ఉండటంపై కొంత గందరగోళ పరిస్థితులు ఉన్న మాట వాస్తవమే. తొలుత ఐసీఏఎంఐగా మార్చడాన్ని చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ వ్యతిరేకించింది. అటుతర్వాత మా సంస్థ పేరును ఐసీఏఐగా మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది మరింత గందరగోళానికి దారితీయడంతో మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్‌గా మార్చుకోవడానికి ఈసారి చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ అడ్డుచెప్పకపోవచ్చని భావిస్తున్నాం. ఇప్పటికే మా సభ్యులను కాస్ట్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్ (సీఎంఏ)గా వ్యవహరిస్తున్నాం. దీంతో మా సంస్థ పేరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఎంఐ)గా మారడానికి ఇబ్బందులు ఉండకూదని అంచనా వేస్తున్నాం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement