జగన్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నాం : జస్టిస్ లక్ష్మణరెడ్డి
సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రానికి కట్టుబడే వారినే ప్రధానమంత్రిని చేద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం సభలో ఇచ్చిన పిలుపును తాము స్వాగతిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర నాయకుడు జస్టిస్ లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆకాంక్షించే తెలుగువారంతా పార్టీలకతీతంగా దీన్ని ఆహ్వానించాలని కోరారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని వేదిక కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి పీఠం ఆశించే రాజకీయ పార్టీలు సమైక్యాన్ని కాంక్షించే తెలుగు ప్రజలు అందిస్తున్న సువర్ణావకాశంగా భావించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచేందుకు తోడ్పాటు అందించాల్సిందిగా వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పక్షాల నేతలను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్టు లక్ష్మణరెడ్డి వెల్లడించారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా సమైక్యతా మానవహారాలు నిర్వహించాలని పిలుపునిస్తున్నట్టు వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి తెలిపారు. సమైక్య రాష్ట్రం కోసం పనిచేస్తున్న అన్ని జేఏసీలను ఒక వేదికపైకి తెచ్చి సమైక్య జేఏసీగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. తాను సమైక్యవాదినంటూ పదేపదే చెప్పే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇక మాటలు చాలించి వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి సమైక్య రాష్ట్రం కోసం తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. దాన్ని కేంద్రం ముందుంచి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. బిల్లు రాకముందే ఇది జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకునే అవకాశం లేదంటూ చెబుతున్న కేంద్ర మంత్రులను ప్రజలు శాంతియుతంగా నిలదీయాలని పిలుపునిచ్చారు. నాయకులు నిస్సహాయులైతే వచ్చే ఎన్నికల్లో గెలవలేరనే సంకేతాలివ్వాలని సూచించారు.