
విడదీయరాని బంధం
కలాంతో జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న రాష్ట్రపతి ప్రణబ్
న్యూఢిల్లీ: దేశ రక్షణ రంగాన్ని అత్యంత బలోపేతం చేసిన అబ్దుల్ కలాం హృదయంలో కవి కూడా ఉన్నాడని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. వ్యక్తిగతంగా ఆయనతో తనకు విడదీయరాని అనుబంధం ఉందంటూ పాత జ్ఞాపకాలను గుర్తుచే సుకున్నారు. యూపీఏ-1 ప్రభుత్వంలో కలాం రాష్ట్రపతిగా ఉన్న సమయంలో తాను రక్షణ శాఖ మంత్రిగా ఉన్నానని పేర్కొన్నారు. కలాం మృతివార్త తెలియగానే ఆయన కర్ణాటకలోని అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. అనంతరం ఢిల్లీలో కలాం భౌతికకాయానికి నివాళి అర్పించారు. ‘దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు ‘అమర్ జవాన్ జ్యోతి’ వద్ద నివాళులు అర్పించేందుకు వెళ్లే సమయంలో ఆయన కొన్ని కవితలు రాసుకునేవారు. వాటిని అక్కడ బయటకి ఉచ్ఛరించేవారు కాదు.. కానీ మౌనంగా తనలో తాను అనుకునేవారు. అలా రెండు మూడు కవితలు నేను విన్నా..’ అని ప్రణబ్ వివరించారు.
బ్రహ్మోస్ క్షిపణులపై కలాం ప్రత్యేక శ్రద్ధ కనబర్చేవారని, ఆయన కృషి వల్లే ఇప్పుడు త్రివిధ దళాల అమ్ముల పొదిలో ఈ క్షిపణలు చేరాయని చెప్పారు. ‘ఇంతకుముందు ఆ క్షిపణిని ఉపరితలం నుంచి ఉపరితలానికి మాత్రమే ప్రయోగించే వీలుండేది. ఇప్పుడు ఉపరితలం నుంచి నింగిలోకి, నింగి నుంచి నింగిలోకి, సముద్రంలోంచి నింగిలోకి ప్రయోగించే సత్తా మన సొంతమైంది. ఇదంతా ఆయన చలవే. శాస్త్రసాంకేతిక విషయాల్లో శివథానుపిళ్లైని ఆయన తన సహచరుడిగా ఎంచుకున్నారు’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. కలాంను ప్రజల రాష్ట్రపతిగా పేర్కొనడాన్ని కొందరు విలేకరులు ప్రస్తావించగా.. ‘అవును ఆయన ప్రజల రాష్ట్రపతే. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా, చివరికి ఇప్పుడు కూడా ఆయన ప్రజల రాష్ట్రపతే. ప్రజలు ఒక రాష్ట్రపతిని ఇంతలా మరెవ్వరినీ ప్రేమించలేదు. నాడు నెహ్రూ చిన్నారుల నుంచి ఇంతటి ప్రేమను పొందారు. ఆ తర్వాత అంతలా ప్రజల అభిమానం సంపాదించుకుంది కలామే..’ అని ప్రణబ్ అన్నారు. కొన్ని సందర్భాల్లో చిన్నారులతో కలాంను చూసినప్పుడు నెహ్రూయే ఆయన రూపంలో వచ్చారా అనుకునేవాడినని పేర్కొన్నారు.