
యాక్సిడెంట్ రోజు సల్మాన్ ఏం చేశారు?
ముంబై: రోడ్డు ప్రమాదం కేసులో ఐదేళ్లు జైలు శిక్ష పడిన బాలివుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఆ రోజు, అంటే 2002, సెప్టెంబర్ 28వ తేదీన ఎక్కడికెళ్లారు, ఎవరెవరితో వెళ్లారు, ఎవరెవరితో గొడవ పడ్డారు, ఏమేం చేశారు. యాక్సిడెంట్‌కు దారితీసేంతగా ఎందుకు తప్పతాగారు ? అన్నవి ఆసక్తికరమైన ప్రశ్నలు. వీటిపై అప్పట్లో మీడియాలో అనేక కథనాలు ప్రచారమయ్యాయి.
నాటి కథనాల ప్రకారం ఆ రోజు మధ్యాహ్నం సల్మాన్ ఖాన్ ఓ సినిమా కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడే బాలివుడ్ అందాల తార, అప్పటికి అప్ కమింగ్ హీరో వివేక్ ఓబరాయ్ కాస్త సన్నిహితంగా ఉండడం చూసి జెలసీ ఫీలయ్యారు. వారిద్దరితోనూ గొడవ పడ్డారు. అక్కడి నుంచి నేరుగా తన సోదరుడు సొహేల్ ఖాన్, సింగర్ కమాల్ ఖాన్, మరికొంత మంది మిత్రులతో కలసి బాంద్రా హిల్ రోడ్డులోని ‘జేడబ్లూ మారియట్ హోటల్’కు వెళ్లారు. ఆ హోటల్‌లోని రెయిన్ బార్‌లో కూర్చున్నారు. మిత్రులతో కలసి ఎక్కువ తాగారు.
రాత్రి 2 గంటల ప్రాంతంలో బార్ నుంచి బయటకొచ్చారు. తన డ్రైవర్ కోసం నిరీక్షించకుండానే తన తెల్లటి టొయోటా ల్యాండ్ క్రూయిజ్ కార్‌లో ఇంటికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. అప్పుడు ఆయనకు పోలీసు డిపార్ట్‌మెంట్ తరఫున బాడీగార్డ్‌గా ఉన్న రవీంద్ర పాటిల్... ‘వద్దు సార్ మీరు కారు నడపకండి, ఎక్కువ తాగారు!’ అంటూ వారించారు. అయినా సల్మాన్ ఖాన్ వినిపించుకోలేదు. తానే కారు నడుపుతానంటూ బయల్దేరారు. ఆయన కారులోనే సింగర్ కమాల్ ఖాన్ ఎక్కారు. కారును దాదాపు వంద కిలోమీటర్ల స్పీడ్‌తో పరుగెత్తించారు. మార్గమధ్యంలో కారు అదుపుతప్పి అదే బాంద్రా రోడ్డులోని ‘అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బేకరీ’ లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో అదే బేకరి ముందు పడుకున్న బేకరీ ఉద్యోగుల్లో ఒకరు మరణించారు. నలుగురు గాయపడ్డారు. ఈ యాక్సిడెంట్‌తో కారులో ఉన్న సింగర్ కమాల్ ఖాన్ అక్కడి నుంచి పారిపోయారు. సల్మాన్ ఖాన్ కారును అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లిపోయారు.
సమాచారం తెలిసిన బాంద్రా పోలీసు స్టేషన్ పోలీసులు అక్కడికి వచ్చారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షులను విచారించారు. వారిచ్చిన సమాచారం మేరకు అదే రోజున సల్మాన్ ఖాన్‌ను అరెస్ట్‌చేసి, అతని నుంచి బ్లడ్ షాంపుల్స్ తీసుకున్నారు. మోటార్ వెహికిల్ చట్టం కింద, అప్పటికి అమల్లోవున్న మద్యపాన నిషేధ చట్టం కింద ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. అక్టోబర్ ఒకటవ తేదీన సల్మాన్ ఖాన్ బెయిల్‌పై విడుదలయ్యారు.
2002, అక్టోబర్ 24వ తేదీన బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టులో ఆయనపై చార్జిషీటు దాఖలైంది. అక్కడి నుంచి కేసు పలు మలుపులు తిరిగింది. అప్పీళ్ల మీద అప్పీళ్ల విచారణ జరిగింది. ముందుగా సల్మాన్ ఖాన్ ప్రమాదానికి కారణమన్న ప్రత్యక్ష సాక్షులు, బార్ ఉద్యోగులు ఆ తర్వాత మాట మార్చారు. ఆఖరికి బాధితులూ మాట మార్చారు. ఏదేమైనా కేసు 13 ఏళ్లు ఓ ప్రహసనంలా నడిచి చివరకు నేడు తీర్పు వెలువడింది.