చెవిలో పూలతో ముద్రగడ నిరసన
- పాదయాత్ర ప్రారంభం కాకుండా మూడోరోజూ అడ్డుకున్న పోలీసులు
కిర్లంపూడి: ‘చలో అమరావతి’ పాదయాత్రకు సిద్ధమైన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను పోలీసులు శనివారం కూడా అడ్డుకున్నారు. దీంతో మండిపడ్డ ఉద్యమనేత.. 24 గంటల్లోగా ఉన్నతాధికారులతో మాట్లాడి పాదయాత్రకు అనుమతించాలని లేదంటే అరెస్టు చేయాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం సర్కారు తీరును నిరసిస్తూ ముద్రగడ సహా కాపు నేతలంతా చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
గడిచిన మూడు రోజులుగా ముద్రగడ పాదయాత్రకు బయలుదేరడం, అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను ఇంటి గేటు వద్దే అడ్డుకోవడం జరుగుతోంది. ఐపీసీ సెక్షన్, 30, సెక్షన్ 144 అమలులో ఉన్నందున ర్యాలీకి అనుమతించబోమని పోలీసులు చెబుతుండగా, అంతే ఘాటుగా స్పందించిన ముద్రగడ.. పోలీసుల నోటీసులపై తాను కోర్టుకు వెళ్లనని, స్టేలు, బెయిల్ తెచ్చుకోబోనని తేల్చిచెప్పారు.