ముద్రగడతో ముగిసిన ప్రభుత్వ చర్చలు
కిర్లంపూడి: కాపు రిజర్వేషన్ల సాధన కోసం నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల చర్చలు ఈ మధ్యాహ్నం ముగిశాయి. దాదాపు గంటన్నర సేపు చర్చలు కొనసాగాయి. మంత్రి అచ్చెన్నాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు ఈ చర్చలు జరిపారు. చర్చలు సఫలమైనట్టు తెలుస్తోంది. కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. చర్చల అనంతరం వైద్యులను తన ఇంట్లోకి ముద్రగడ అనుమతించడంతో చర్చలు సఫలమైనట్టు భావిస్తున్నారు. ముద్రగడ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించినట్టు సమాచారం.
తొలుత అసలు మంత్రులెవరినీ చర్చలకు పంపేది లేదని బెట్టుచేసిన సీఎం చంద్రబాబు.. పరిస్థితి చేయి దాటిపోతోందన్న విషయం గమనించి సోమవారం నాడు మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ప్రతినిధులను అక్కడకు పంపారు. ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్ష నాలుగో రోజుకు చేరడంతో ఉదయం నుంచి కిర్లంపూడి పరిసరాల్లో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.
నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు జరిపిన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఉదయం మరోసారి చర్చలకు వచ్చారు. కాగా ప్రభుత్వ ప్రతినిధుల ముందు ముద్రగడ మూడు ప్రతిపాదనలు పెట్టినట్టు ఆయన మద్దతుదారులు తెలిపారు. మంజునాథ కమిషన్ కు నిర్ధిష్ట కాలపరిమితి, కాపు కార్పొరేషన్ లో తాను సూచించిన వ్యక్తికి స్థానం కల్పించాలని ముద్రగడ డిమాండ్ చేసినట్టు వెల్లడించారు.