కిర్లంపూడి బయల్దేరిన ముద్రగడ పద్మనాభం
గత 14 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి బయల్దేరి వెళ్లారు. పోలీసులు తరలించే పరిస్థితి లేకపోవడంతో ముద్రగడ అనుచరులే ఆయనను ఆయన సొంత వాహనంలో తీసుకెళ్లారు. అయితే, అక్కడ కూడా ఆయన దీక్ష విరమిస్తారా లేదా అన్న విషయం ఇంతవరకు తెలియలేదు. దారిలో ఎక్కడా ఊరేగింపులు, ఇతర ప్రదర్శనలు జరగకుండా ముందుగానే మార్గం మొత్తాన్ని పోలీసులు దిగ్బంధించారు. రాజమండ్రి నుంచి కిర్లంపూడికి వెళ్లడానికి దాదాపు గంట సమయం పడుతుంది.
ఆయన ఆరోగ్యం ఎలా ఉందన్న విషయం కూడా ఇంతవరకు తెలియలేదు. నిలకడగా ఉందని మాత్రమే చెబుతున్నారు. మంగళవారం నాడు హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయలేదు. రోడ్డు మొత్తం ముందుగానే క్లియర్ చేసి, ర్యాలీలు జరగకుండా నేరుగా రాజమండ్రి నుంచి కిర్లంపూడి వెళ్లేలా చూస్తున్నారు. ముద్రగడ అభిమానులు కొంతమంది ఇప్పటికే కిర్లంపూడికి చేరుకున్నారు. అయితే అక్కడ భారీ ఎత్తున పోలీసు బలగాలు ఉన్నాయి. కిర్లంపూడిలో సైతం ఎవరినైనా ముద్రగడను కలవనిస్తారో లేదో స్పష్టంగా తెలియలేదు.