సొంత ఖర్చుతో ప్రత్యూషకు పెళ్లి చేస్తా: కేసీఆర్
హైదరాబాద్: సొంత ఖర్చుతో ఇల్లు కట్టించి, మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రత్యూషకు హామీ ఇచ్చారు. వైద్యానికి, విద్యకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్ చెప్పారు. జరిగిన సంఘటనను ఓ పీడకలగా మరచిపోయి కొత్తజీవితం ఆరంభించాలని ప్రత్యూషకు సూచించారు. సవతి తల్లి, కన్న తండ్రి చేతుల్లో చిత్రహింసలకు గురై తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతున్న ప్రత్యూషను శనివారం మధ్యాహ్నం కేసీఆర్ పరామర్శించారు.
ప్రత్యూష చికిత్స పొందుతున్న సరూర్ నగర్ లోని అవేర్ గ్లోబల్ హాస్పిటల్కు కేసీఆర్ దంపతులు వెళ్లారు. కేసీఆర్ దంపతులతో పాటు వారి కుమార్తె, ఎంపీ కవిత కూడా వచ్చారు. ప్రత్యూష ఆరోగ్య పరిస్థితి గురించి కేసీఆర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రత్యూషను చిత్ర హింసలు పెట్టినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రత్యూష ఆరోగ్యం, భద్రత చూసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబారాబాద్ పోలీస్ కమిషనర్లను కేసీఆర్ ఆదేశించారు. తనను హింసించిన తండ్రి, సవతి తల్లి జైలు నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రత్యూష.. కేసీఆర్ను కోరారు.