సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కోసం పదిరోజులుగా ఇక్కడ మకాం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. రెండు రోజుల కిందట రక్షణ మంత్రి, కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యుడు ఏకే ఆంటోనీతో సమావేశమైన ఆయన మంగళవారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపేందుకే మర్యాదపూర్వకంగా ఆ పార్టీ నేతలను కలుసుకొంటున్నానంటున్న ఆయన.. హైదరాబాద్ తిరిగివెళ్లేలోగా మరికొంతమంది నేతలతో కూడా సమావేశం కానున్నట్లు తెలిపారు. దిగ్విజయ్‌తో దాదాపు 2 గంటలకుపైగా చర్చలు జరిపినట్లు ధ్రువీకరించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను సాధ్యమైనంత త్వర గా పూర్తిచేయాలని కోరినట్లు తెలిపారు.
మీ ప్రాంత సమస్యలు చెప్పుకుంటే మేలు
సీమాంధ్ర నేతలు విభజనను ప్రశ్నించడం ఆపివేసి, తమ ప్రాంతానికి ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారానికి ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించడం మంచిదని కేసీఆర్ హితవు పలికారు. ఆయన మంగళవారంనాడిక్కడ తనను కలిసిన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. విభజన విషయంలో సీమాంధ్రవాసుల భయాందోళనలను తొలగించి, సమస్యలకు సముచిత పరిష్కారాలు చూపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. విలీనం విషయంలో తాను ఏమాత్రం తొందర పడదలుచుకోలేదని తెలిపారు. వచ్చే ఏప్రిల్, మే మాసాల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో బలీయమైన శక్తిగా ఉన్న ప్రాంతీయ పార్టీలు 16వ లోక్‌సభలో కాంగ్రెస్, బీజేపీల కంటే అధిక స్థానాలను గెలుచుకొంటాయని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రెంటికీ చెడ్డ రేవడిలా తయారై ఉనికిని కోల్పోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ మంతనాలు
Published Wed, Sep 4 2013 6:02 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement
Advertisement