డెహ్రాడూన్: కొండచరియలు కూలిపడటంతో కేదార్‌నాథ్ యాత్రకు అవరోధం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ వద్ద శనివారం కొండచరియలు కూలిపడటంతో కేదార్‌నాథ్ వైపు వెళ్లే తిల్వాడా-గుప్తకాశీ మార్గం మూసుకుపోయింది. కొండచరియలు పడటం వల్ల ఎవరికీ గాయాలు కాకున్నా, వాతావరణ పరిస్థితుల దష్ట్యా రాష్ట్రప్రభుత్వం కేదార్‌నాథ్ యాత్రను నిలిపివేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మార్గంలో ముందుకు సాగడం ప్రమాదంతో కూడుకున్నదని, వాతావరణం మెరుగుపడేంత వరకు ఎలాంటి రిస్కు తీసుకోదలచుకోలేదని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు.
ఇలాగే, వాతావరణ పరిస్థితి అనుకూలించకపోవడంతో పదిరోజుల కిందట కూడా కేదార్‌నాథ్ యాత్రకు అవరోధం ఏర్పడింది. అయితే, యాత్రికుల భద్రత కోసం తగిన ఏర్పాట్లన్నీ చేసినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది.