
‘మోదీకి సహారా లంచం, ఇదే రుజువు’
- ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపణ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యంగా ఆరోపణలు గుప్పించారు. సహారా కంపెనీ నుంచి ప్రధాని మోదీ లంచాలు తీసుకున్నారని, అందుకే ఈ కేసులో సహారాతోపాటు తనను తాను కాపాడుకుంటున్నారని అన్నారు. తనకు వ్యతిరేకంగా దర్యాప్తు జరగకుండా మోదీ అడ్డుకోవడం ఆయన లంచం తీసుకున్నారనడానికి రుజువు అని కేజ్రీవాల్ అభివర్ణించారు.
’సహారాకే కాదు మోదీకి కూడా దర్యాప్తు జరగకుండా రక్షణ లభించింది. సహారా కంపెనీ నుంచి ఆయన లంచాలు తీసుకున్నారు. అందుకే తనకు వ్యతిరేకంగా దర్యాప్తు జరగకుండా మోదీ ప్రయత్నిస్తున్నారు. ఆయన లంచాలు తీసుకున్నారనడానికి ఇదు రుజువు’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. 2014 నవంబర్‌లో సహారా కంపెనీపై జరిపిన ఐటీ దాడుల్లో దొరికిన డైరీల్లో పలువురు నాయకులకు ముడుపులు ముట్టజెప్పినట్టు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.
ఈ డైరీల ఆధారంగానే మోదీ వ్యక్తిగత అవినీతికి పాల్పడ్డారని, లంచాలు తీసుకున్నారని గతంలో కేజ్రీవాల్, రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే, ఈ డైరీల్లలోని విషయాల ఆధారంగా దర్యాప్తు చేపట్టలేమంటూ ఆదాయపన్నుశాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని షేర్ చేసిన కేజ్రీవాల్.. మోదీ తనపై దర్యాప్తు జరగకుండా అడ్డుకుంటున్నారని, అందుకే ఇదే నిదర్శనమని ఆరోపించారు.
Not Sahara but Modi ji who gets immunity. He recd bribes from Sahara. Modiji scuttling all enquiries against him. Proves he took bribes https://t.co/92OZxKAebY
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 5, 2017