కేజ్రీవాల్ ఓ నియంత.. అందుకే చీలిక
ఇండోర్: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నియంత స్వభావం కలవారని సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్ ఆరోపించారు. అందుకే ఆప్లో చీలికలు, వర్గ విభేదాలు అని, దీనికి కేజ్రీవాలే బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ఆయన నియంత స్వభావానికి తాను స్వయంగా సాక్షినని, ప్రత్యక్షంగా కేజ్రీవాల్ స్వభావం తెలుసుకున్నానని చెప్పారు.
నిర్ణయాలు తీసుకునే ముందు ఎవరినీ సంప్రదించడని, అసలు తన ముందు ఎవరినీ నిలవనివ్వడంగానీ, మాట్లాడనివ్వడం గానీ చేయనిచ్చేవాడు కాదని అన్నారు. ఇదంతా తాను అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారేతో కలిసి పోరాడే ముందు గమనించానని చెప్పారు. గతంలోనే కేజ్రీవాల్ స్వభావాన్ని ప్రశాంత్ భూషణ్ కు హెచ్చరించినా ఆయన మౌనం పాటించారే తప్ప స్పందించలేదని, నేడు మాత్రం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. హజారేను మరిన్ని రోజులు నిరాహార దీక్ష కొనసాగించాలని కేజ్రీవాల్ ఒత్తిడి చేసేవారని ఆరోపించారు.