
కిరణ్... రియల్ హీరో
ముగ్గురిని కాపాడి మృత్యువాత
మండి నుంచి సాక్షి ప్రతినిధి: ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి కిరణ్‌కుమార్ తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ ముగ్గురు తోటివారిని కాపాడాడు. ఆ ప్రయత్నంలో ప్రవాహానికి బలైపోయాడు. చేతికందివచ్చిన కొడుకు చివరికి తమకిలా కడుపు కోత మిగిల్చాడంటూ అతని తండ్రి వెంకటరమణ కన్నీరుమున్నీరయ్యారు. పండో డ్యామ్ వద్ద ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘మాది ఖమ్మం జిల్లా. నేను స్కూల్ టీచర్‌ను. ఆదివారం సాయంత్రం ప్రమాదానికి ముందు 6.10కి మావాడు నాతో మాట్లాడాడు. కులూకు 40 కి.మీ. దూరంలో ఉన్నానని చెప్పాడు. అన్నం లేటుగా తిన్నామని చెప్పాడు. అవే చివరి మాటలు. ప్రమాదం జరిగిందని రాత్రి 8 గంటలకు టీవీల్లో చూసి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. నిన్న నేను ఇక్కడ విమానాశ్రయంలో దిగగానే మిగతా విద్యార్థులు కలిశారు. కిరణ్ వల్లే బతికామని ప్రత్యూష, దివ్య అనే అమ్మాయిలు చెప్పారు. ‘అంకుల్! మీ అబ్బాయి వల్లే మేం బతికాం. కానీ కిరణ్ తన ప్రాణాలు మాత్రం కాపాడుకోలేకపోయాడు’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వాడు వాళ్లతో పాటు మరో అమ్మాయిని రక్షించి తాను బలయ్యాడు’’ అంటూ రోదించారు.