మరో 2 మృతదేహాలు లభ్యం
సాక్షి, హైదరాబాద్: హిమాచల్ దుర్ఘటనకు బలైన ఇంజనీరింగ్ విద్యార్థుల్లో మరో ఇద్దరి మృతదేహాలు గురువారం లభించాయి. మృతులను ఖమ్మం జిల్లాకు చెందిన తల్లాడ ఉపేందర్, హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన గూమూరు అరవింద్ కుమార్‌గా ఘటనా స్థలి వద్ద ఉన్న వారి కుటుంబీకులు గుర్తించారు. మృతదేహాలు బియాస్ నదిలో లార్జి డ్యామ్‌కు దిగువన ప్రమాద స్థలికి కిలోమీటర్ దూరంలోనే లభించాయి. బండరాళ్ల కింద బురదలో కూరుకుపోవడంతో వాటిని వెలికితీయడం చాలా కష్టమైందని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న బాలానగర్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, గ్రేహౌండ్స్ ఎస్పీ కార్తికేయ ‘సాక్షి’కి తెలిపారు. మృతదేహాలను ఢిల్లీ తరలించామని, వారి కుటుంబసభ్యులతో పాటు శుక్రవారం మధ్యాహ్నానికల్లా విమానంలో హైదరాబాద్ పంపుతామని వివరించారు.
హైదరాబాద్‌కు చెందిన విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల విహార యాత్ర గత ఆదివారం సాయంత్రం పెను విషాదంగా మారడం, హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో లార్జి డ్యామ్ నుంచి చెప్పాపెట్టకుండా నీటిని విడుదల చేయడంతో... దిగువన ఫొటోలు తీసుకుంటున్న 24 మంది విద్యార్థులు, ఒక టూర్ ఆపరేటర్ నదిలో కొట్టుకుపోవడం తెలిసిందే. ఇప్పటిదాకా ఎనిమిది మంది మృతదేహాలు లభించగా మరో 17 మంది ఆచూకీ ఇంకా లభించాల్సి ఉంది. వారికోసం వందలాది మంది నేవీ సిబ్బంది, గజ ఈతగాళ్లు అధునాతన పద్ధతుల్లో గాలిస్తున్నారు. గురువారం 15 మంది నేవీ డైవర్లు వారికి తోడయ్యారు. వాతావరణం కూడా కాస్త తెరిపినివ్వడంతో ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గురువారం దొరికిన రెండు మృతదేహాలూ ప్రమాద స్థలికి అతి సమీపంలోనే బండరాళ్ల కింద చిక్కుకున్న నేపథ్యంలో మిగతా వారి కోసం కూడా అక్కడే గాలిస్తున్నారు. ఎంత లోతు నీటిలోనైనా వస్తువులను కనిపెట్టగలిగే అత్యంత శక్తిమంతమైన కెమెరాలను ఉపయోగిస్తున్నారు. బురదలో కూరుకుపోయిన వస్తువుల జాడను కూడా ఇవి పసిగట్టగలవు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వైస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి ఘటనా స్థలిని సందర్శించారు. బండరాళ్లు, విపరీతమైన బురద కారణంగా గల్లంతైన వారి ఆచూకీ తీయడం కష్టతరంగా మారిందన్నారు. ‘‘నీళ్ల లోపల దూరం వరకు చూడటం అసాధ్యంగా మారింది. కేవలం చుట్టూ తడిమి, చేత్తో తాకి మాత్రమే శరీరాలను గుర్తించాల్సి వస్తోంది’’ అని చెప్పారు. మానవరహిత విమానాన్ని కూడా రంగంలోకి దించామన్నారు. మరోవైపు విద్యార్థులను వెదికేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి 15 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక ఈత నిపుణుల బృందం శుక్రవారం హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లనుందని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు.
కన్నపేగు కన్నీరుమున్నీరు
పాల్వంచ: బియాస్ నదిలో గల్లంతైన ఖమ్మం జిల్లా పాల్వంచ గట్టాయిగూడానికి చెందిన తల్లాడ ఉపేందర్ చివరికి విగతజీవిగా కన్పించడంతో అతని తల్లిదండ్రులు, రక్త సంబంధీకులు గుండె పగిలేలా రోదిస్తున్నారు. గురువారం గాలింపులో దొరికిన రెండు మృతదేహాల్లో ఒకటి ఉపేందర్‌దేనని టీవీల్లో వచ్చిన వార్తలు చూసి అతని తల్లి శ్రీదేవి, నాన మ్మ సువర్ణ, త మ్ముడు మహేశ్ కుప్పకూలి గుండెలవిసేలా రోదించారు. కుమారుని ఆచూకీ కోసం రెండు రోజులుగా ఘటనాస్థలి వద్దే పడిగాపులు పడుతున్న తండ్రి శ్రీనివాస్‌ను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. ‘పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తాడనుకున్నాం. విహార యాత్రకని వెళ్లి కానరాని లోకాలకు చేరుకున్నాడు’ అంటూ కంటతడి పెట్టారు. కాలేజీ యాజమాన్య నిర్లక్ష్యం వల్లే తమవంటి వారెందరికో కడుపు కోత మిగిలిందంటూ ఆక్రోశించారు.