- గల్లంతైన విద్యార్థుల ఆచూకీకి కృషి
- ఎన్‌డీఎంఏ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి
బేగంపేట: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదీ ప్రవాహంలో గల్లంతైన నగర విద్యార్థుల ఆచూకీ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జల్లెడ పడుతున్నట్లు ఎన్‌డీఎంఏ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. శనివారం బేగంపేటలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లార్జి డ్యామ్ కింది భాగంలోని మూడున్నర కిలోమీటర్ల పరిధిలో ఇక ఎలాంటి మృతదేహం ఉండే అవకాశం లేదని తమ సంస్థ నిపుణులు తేల్చిచెప్పినట్లు చెప్పారు.
ఆదివారం ఉదయం నుంచిప్రారంభించే సెర్చింగ్ ఆపరేషన్‌లో నౌకాదళానికి చెందిన అత్యాధునిక సైడ్ స్కాన్ సోనార్, జీఎంఆర్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చెందిన లాడర్ అనే మరో స్కానింగ్ యంత్రం సాయంతో నది అడుగు భాగంలో జల్లెడ పట్టనున్నట్లు పేర్కొన్నారు. మెత్తం ఆపరేషన్‌లో తమ ఎన్‌డీఎంఏ టీమ్‌తో సహా మెత్తం 700 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు తెలిపారు.
లార్జి డ్యామ్ కింద నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాండో డ్యామ్ వరకు జల్లెడ పడుతున్నట్లు తెలిపారు. తీవ్ర వాతవరణ ప్రతికూలతల మధ్య విద్యార్థుల ఆచూకీ కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల వేదనను తాము అర్థం చేసుకుంటామని అయితే ప్రకృతి సహకరించక పోవడంతో తీవ్ర ఆలస్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
సైబరాబాద్ పోలీసు బృందం తిరుగు పయనం
హిమాచల్‌ప్రదేశ్ మండి జిల్లా లార్జి డ్యామ్ వద్ద బియాస్ నదీ ప్రవాహంలో గల్లంతైన విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ విద్యార్థుల గాలింపు చర్యల్లో పాలుపంచుకున్న సైబరాబాద్ పోలీసుల బృందం నేడు తిరుగుపయనమైంది. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే స్పందించిన సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సహాయక చర్యల కోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపించిన విషయం తెలిసిందే.
బాలనగర్ డీసీపీ ఎ.ఆర్.శ్రీనివాస్ నేతృత్వంలో వెళ్లిన పేట్‌బషీరాబాద్ ఏసీపీ ఎం.శ్రీనివాసరావు, దుండిగల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు బృందం ఘటనా స్థలంలో వారం రోజుల పాటు బాధిత విద్యార్థి కుటుంబాలకు ధైర్యం చెబుతూ సహాయ చర్యల్లో పాలు పంచుకున్నారు.
విద్యార్థుల మృతదేహాలు వెలికి తీయడంలో అక్కడి అధికారులు, సిబ్బందికి తోడుగా నిలిచారు. వెలికి తీసిన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడం లోను, మృతదేహాలు హైదరాబాద్‌కు తరలించడంలో సహకరించారు. గ ల్లం తైన 24 మంది విద్యార్థుల్లో కేవలం 8 మంది విద్యార్థుల మృతదేహాలు మాత్రమే బయటపడగా.. ఇంకా 16 మంది ఆచూకీ కానరాలేదు.
మృతదేహాలు వెలికి తీసేందుకు ఇంకా ఆధునిక పరికరాలతో గాలింపు చర్యలు చేపట్టాలని అక్కడి ప్రభుత్వం భావించింది. దీంతో వారం రోజు నుంచి అక్కడే విధినిర్వహణలో నిమగ్నమైన సైబరాబాద్ పోలీసులు ఆదివారం తిరిగి రానున్నారు. మృతదేహాలు ఆలస్యంగా లభించే అవకాశాలు ఉన్నాయని బాలనగర్ డీసీపీ ఏ.ఆర్.శ్రీనివాస్ పేర్కొన్నారు.