
ఆ మూడింటిలో అద్భుత ప్రగతి
విద్యుత్, నీటిసరఫరా,శాంతి భద్రతల పరిరక్షణలో సఫలమయ్యాం
• అందుకే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఆదరించారు
• నీటి సరఫరాలో పైపులైన్ల లీకేజీని అరికట్టేందుకు చర్యలు
• రూ.502 కోట్ల విలువైన 465 కిలోమీటర్ల పైపులైన్ పనులు పెండింగ్‌లో..
• హైదరాబాద్‌లో మంచినీటి సరఫరా, మురుగునీటి నిర్వహణపై కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రజలకు అవసరమైన మూడు అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం అద్భుత ప్రగతిని సాధించిందని, అందుకే ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నగర ప్రజలు తమను మనస్ఫూర్తిగా ఆదరించారని మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు అన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా, సక్రమమైన నీటి సరఫరా, శాంతిభద్రతల నిర్వహణలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మజ్లిస్ సభ్యులు అక్బరుద్దీన్ ఒవైసీ, ముంతాజ్ అహ్మద్‌ఖాన్, మొహ్మద్ మోజంఖాన్ నగరంలో మంచినీటి సరఫరాలో ఇబ్బందులపై అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు.
నగరంలో మొత్తం 1,334 కిలోమీటర్ల పైప్‌లైన్ మార్పిడి పనులు అవసరమవుతాయని 2013–14లో చేసిన ఓ అధ్యయనంలో తేలిందని, అందులో ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మరీ అధ్వానంగా ఉన్న 178 కిలోమీటర్ల మేర పనులను పూర్తి చేశామని చెప్పారు. నగరం నడిబొడ్డున, శివార్లలో, పాతబస్తీలో కలిపి ఇంకో 698 కిలోమీటర్ల పైప్‌లైన్ పనులు పురోగతిలో ఉన్నాయని, ఇంకో 465 కిలోమీటర్ల మేర రూ.502 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉందని చెప్పారు. దశలవారీగా పైప్‌లైన్ల పరిస్థితిని బట్టి, బోర్డులో ఉన్న నిధులు, ప్రభుత్వ బడ్జెట్‌ను అంచనా వేసుకుంటూ ముందుకెళుతున్నా మని తెలిపారు.
నగర ప్రజలకు శుద్ధమైన, నాణ్యమైన మంచినీటిని ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అక్బరుద్దీన్ మాట్లాడుతూ నగరానికి వస్తున్న నీటిని సక్రమంగా వినియోగించుకోలేక పోవడానికి పైపులైన్ల లీకేజీలే కారణమని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అసలైన హైదరాబాద్‌లో నివసించే అసలైన తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్లు, ప్రజలు నగరంలో హాయిగా ఉంటున్నారని ఆరోపించారు. దీనికి స్పందించిన మంత్రి హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న వారంతా తెలంగాణవాసులేనని, అందరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.
కాలుష్య కారక పరిశ్రమల తరలింపు 2017 కల్లా పూర్తి
రెడ్, ఆరెంజ్ కేటగిరీలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించే కార్యక్రమంలోని మొదటి దశను 2017 చివరికల్లా పూర్తి చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. మొత్తం ఈ కేటగిరీలో 1,545 పరిశ్రమలను గుర్తిం చామని, అందులో 1,160 పరిశ్రమలను తొలిదశలో తరలిస్తామని వెల్లడించారు. టీఆర్‌ఎస్ సభ్యులు కేపీ వివేకానంద, సుధీర్‌రెడ్డి, అంజయ్య శాటిలైట్ టౌన్ షిప్‌లపై అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ రాజధాని చుట్టూ 13 శాటిలైట్ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేస్తున్నా మని, వాటికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ముసాయిదా దశలో ఉందని చెప్పారు. 330 కిలోమీటర్లతో ప్రతిపాదించిన రీజినల్ రింగ్ రోడ్డుకు జాతీయ రహదారి హోదా కల్పించేందుకు ప్రభుత్వం అంగీకరిం చిందన్నారు.