లలిత్ మోదీ ఎందుకు ఎదురు తిరిగారు?
న్యూఢిల్లీ: ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ లలిత్ మోదీ బ్రిటన్ ఇమిగ్రేషన్ వీసా కేసులో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె పీకలోతువరకు ఇరుక్కుపోయారు. తన ఇమిగ్రేషన్ వీసాకు సిఫారసు చేసింది వసుంధర రాజె అని ముందుగా వెల్లడించిన లలిత్ మోదీ 2012, 2013లలో తన బార్య మినాల్‌ను పోర్చుగల్ కేన్సర్ ఆస్పత్రికి వసుంధర రాజెనే స్వయంగా తీసుకెళ్లారని కొత్తగా బయటపెట్టారు. ఈ విషయాన్ని ఆయన మాంటెనిగ్రోలో ‘ఇండియా టుడే టీవీ’ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అందుకేనేమో ఈ వ్యవహారంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను వెనకేసుకొస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వం వసుంధర గురించి మాట్లాడడం లేదు.
30 ఏళ్ల నుంచి వసుంధర రాజె తనకు ఫ్యామిలీ ఫ్రెండని, తన భార్యకు అత్యంత సన్నిహితురాలని చెబుతున్న మోదీ, హఠాత్తుగా వసుంధర రాజె కు ఎందుకు ఎదురు తిరిగారు? తన ఎదుగుదలకు ఆమె కారణమని చెబుతూ వచ్చి, అందుకు ప్రతిఫలంగా(క్విడ్ ప్రోకో) ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్‌కు చెందిన ‘నియంత్ హెరిటేజ్ హోటల్ ప్రవేట్ లిమిటెడ్ కంపెనీలో పది రూపాయల షేరును ఏకంగా 96 వేల రూపాలకు కొనుగోలు చేసిన మోదీ ఎందుకు ఆమెను ఈ కేసులో ఇరికిస్తున్నారనే సందేహం ఎవరికైనా రావచ్చు. దీనివెనక పెద్ద కథే ఉంది.
ఐపీఎల్ ఫిక్సింగ్, ఫెమా కేసుల్లో నిందితుడైన లలిత్ మోదీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు 2013, సెప్టెంబర్ నెలలో బోర్డు నుంచి శాశ్వతంగా వెలివేసిన విషయం తెల్సిందే. ఆదే ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన వసుంధర రాజె తన పలుకుబడిని ఉపయోగించి రాజస్థాన్ క్రికెట్ అసోసియోషన్ అధ్యక్షుడిగా లలిత్ మోదీ ఎన్నికయ్యేలా చూశారు. 2014, మే నెలలో రాజస్థాన్ క్రికెట్ అసోసియోషన్‌కు మోదీ ఎన్నికవడం పట్ల బీసీసీఐ కన్నెర్ర చేసింది. తాము శాశ్వతంగా బహిష్కరించిన ఓ వ్యక్తిని ఎలా ఎన్నుకుంటారంటూ రాజస్థాన్ క్రికెట్ అసోసియోషన్‌ను హెచ్చరించడమే కాకుండా ఏ లీగ్ మ్యాచుల్లోనూ ఆ రాష్ట్ర జట్టును ఆడనీయమని తాకీదు ఇచ్చింది. దీనిపై అసోసియోషన్ కోర్టుకెక్కింది.
రాష్ట్రానికి చెందిన దాదాపు 75 మంది క్రికెట్ క్రీడాకారులు తాము రోడ్డునపడుతున్నామంటూ ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పైనుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు వసుంధర రాజె జోక్యం చేసుకొని 2014, అక్టోబర్ నెలలో లలిత్ మోదీని తొలగించి, ఆ స్థానంలో రాష్ట్ర బీజేపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు అమిన్ పఠాన్‌ను ఎంపికయ్యేలా చూశారు. దీంతో లండన్‌లోవున్న మోదీకి కోపం వచ్చింది. ఆగ్రహంతో వసుంధర రాజె స్థానంలో బీజేపీ నాయకులు ఓం మాథూర్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిందిగా కూడా రాష్ట్ర బీజేపీ నేతలకు ట్వీట్ పంపించారు.
లలిత్ మోదీకి ఇమిగ్రేషన్ వీసా ఇవ్వండంటూ సిఫారసు లేఖపై సంతకం చేసిన వసుంధర రాజె, అసలు సంతకం చేశానా, లేదా, ఏ పత్రం మీద సంతకం చేశానో కూడా గుర్తులేదంటూ బుకాయిస్తున్న వసుంధర రాజె, మోదీ వెల్లడించిన తాజా అంశంపై ఓం మాట్లాడతారో చూడాలి.