అనుకున్నట్లే అయింది. దాణా కుంభకోణంలో శిక్ష అనుభవిస్తున్న ఎంపీలు లాలూ ప్రసాద్ యాదవ్, జగదీశ్ శర్మ లోక్‌సభ సభ్యత్వాల్ని కోల్పోయారు.
న్యూఢిల్లీ: అనుకున్నట్లే అయింది. దాణా కుంభకోణంలో శిక్ష అనుభవిస్తున్న ఎంపీలు లాలూ ప్రసాద్ యాదవ్, జగదీశ్ శర్మ లోక్‌సభ సభ్యత్వాల్ని కోల్పోయారు. వీరిని అనర్హులుగా ప్రకటిస్తూ లోక్‌సభ ప్రధా న కార్యదర్శి బాల్ శేఖర్ ప్రకటన జారీ చేశారు. ఆర్‌జేడీ చీఫ్ లాలూపై మొత్తం పదకొండేళ్లు, జగదీశ్‌పై మొత్తం పదేళ్లు అనర్హత వేటు పడింది. ఐదేళ్లు శిక్ష పడ్డ లాలూ జైలు నుంచి విడుదలైన తర్వాత ఆరేళ్లు, నాలుగేళ్ల శిక్ష పడ్డ జగదీశ్ శిక్ష అనంతరం మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికల నియమావళి ప్రకారం నిషేధం విధించారు. ఈ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి కూడా పంపారు. 65 ఏళ్ల లాలూ బీహార్‌లోని శరణ్ నియోజకవర్గం నుంచి 63 ఏళ్ల జగదీశ్ శర్మ జహానాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యా రు.
కాగా, కళంకిత ప్రజాప్రతినిధుల అనర్హతపై ఈ ఏడాది జూలై 10న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విష యం తెలిసిందే. ఆ తీర్పును అనుసరించి పార్లమెంట్ సభ్యులపై వేటు పడడం ఇది రెండోసారి కాగా, లోక్‌సభ సభ్యులపై మొదటిసారి. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రషీద్ మసూద్‌పై ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారం సోమవారం అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. సీబీఐ కోర్టు సెప్టెంబర్ 19న దోషిగా తీర్పిస్తూ ఆయనకు నాలుగేళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది. అప్పటి నుంచీ ఆయనపై నిషేధం అమల్లోకి వస్తుందని రాజ్యసభ సెక్రెటేరియట్ తన నిషేధ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే శిక్ష ఖరారైనా వెంటనే నిషే ధం పడకుండా ఉండేలా ఒక ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దానిని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించడం, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా దానిని ఒక నాన్సెన్స్‌గా అభివర్ణించడంతో ఆ ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ఆమోదానికి పంపకుండానే వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అటార్నీ జనరల్ వాహనవతి కూడా ఎంపీ సీట్లు ఖాళీ అయ్యాయని ప్రకటిస్తూ వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని ఈ మధ్యనే లోక్‌సభ సెక్రటేరియట్‌కు చెప్పారు.