ప్రజల దృష్టిలో లాలూ ఓ హీరో: రబ్రీదేవి
'ప్రజల దృష్టిలో రాష్టీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఓ హీరో' అని బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన సతీమణి రబ్రీ దేవి వ్యాఖ్యానించారు. లోకసభ సభ్యుడిగా అనర్హతతోపాటు, మరో పదకొండు ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా లాలూపై వేటు పడిన నేపథ్యంలో రబ్రీ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తల, ప్రజల దృష్టిలో లాలూ ప్రసాద్ యాదవ్ ఓ హీరో అని వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా రాజకీయ కుట్రకు తన భర్త బలైపోయాడు అని అన్నారు. పశుగ్రాస కుంభకోణంలో లాలూకు ఐదేళ్ల పాటు, మరో ఎంపీ జగదీష్ శర్మలకు సీబీఐ ప్రత్యేక కోర్టు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాలూ, శర్మలు రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.