నరేంద్ర మోడీని ఢీ కొడతా: లాలూ
రాంచీ: మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా లౌకిక పార్టీలను ఏకం చేయనున్నట్టు బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. మతతత్వ పార్టీలను అధికారంలోకి రాకుండా చేయడానికి ఎటువంటి త్యాగానికైనా సిద్ధమన్నారు. 'నరేంద్ర మోడీ లేదా మరో మోడీ అయినా ఎదుర్కొవడానికి నేను సిద్ధం' అన్నారు. లౌకిక పార్టీలను ఏకం చేసేందుకు దేశమంతా పర్యటిస్తానని చెప్పారు.
లోక్పాల్ బిల్లును అడ్డుకునేందుకు అన్నా హజారే లాంటి వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అర్వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలకే పరిమితమైందని, ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాలేకపోతోందని ఎద్దేవా చేశారు.
బిర్సాముండా జైలు నుంచి బెయిల్పై ఆయన సోమవారం మధ్యాహ్నం విడుదలయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.