పంజాబ్, గోవా ఫలితాలపై లాలూ జోస్యం
పట్నా: ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శనివారం పంజాబ్, గోవాల్లో పోలింగ్ కొనసాగుతున్నది. ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం పంజాబ్‌లో మందకోడిగానూ, గోవాలో భారీగానూ ఓటింగ్ జరుగుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న బీజేపీ.. హ్యాట్రిక్ కొట్టి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నది. ఆమేరకు భారీ ప్రచారాన్నికూడా నిర్వహించింది. ఇదిలా ఉంటే నేటి పోలింగ్ సరళిని నిశితంగా గమనించిన మీదట ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేదానిపై జోస్యం చెప్పారు ప్రముఖ రాజకీయ నాయకుడు, ఆర్‌ఎల్‌డీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్. శనివారం పట్నాలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
పంజాబ్, గోవాల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని తనకు సంకేతాలు అందినట్లు లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పారు. అటు యూపీలోనూ బీజేపీ కలలు నెరవేరవని జోస్యం చెప్పారు. బీజేపీ ఓటమికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అమిత్‌షాకూడా కారణం అవుతారని లాలూ అన్నారు. ఈ సందర్భంగా అమిత్ షాను ఉద్దేశించి లాలూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘అమిత్ షా కూడా ఓ నాయకుడేనా? అతను రాజకీయాలకు చెందినవాడు కానేకాదు.. డబ్బు మనిషి! డబ్బుకు సంబంధించిన కార్యకలాపలు తప్ప అతనికేమీ చేతకాదు’అని లాలూ విమర్శించారు.