గోవాలో జోరు.. పంజాబ్‌లో బేజారు
న్యూఢిల్లీ: గోవా, పంజాబ్‌లలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. గోవాలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉత్సాహం చూపుతున్నారు. శనివారం పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి రికార్డు స్థాయిలో 67 శాతం పోలింగ్ నమోదైంది. కాగా పంజాబ్‌లో ఇందుకు భిన్నమైన పరిస్థతి కనిపిస్తోంది. గోవాతో పోలిస్తే చాలా తక్కువ శాతం ఓటింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 2:30 గంటలకు 48 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది.
2012 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ భారీగా పోలింగ్ జరిగింది. పంజాబ్‌లో 79 శాతం, గోవాలో 82.2 శాతం ఓటింగ్ నమోదైంది. తాజా ఎన్నికల్లో గోవాలో అదే స్థాయిలో ఓటింగ్ జరుగుతుండగా, పంజాబ్‌లో చాలా మందగించింది. రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గోవాలో బీజేపీ, పంజాబ్‌లో బీజేపీ-అకాలీదళ్ అధికారంలో ఉన్నాయి. వచ్చే నెల 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.