ఆర్బీఐ, సీబీఐ తరహాలో ఈసీ కూడా..
న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈసీ పూర్తిగా ప్రధాని నరేంద్ర మోదీకి లొంగిపోయిందని, పిరికిపందలా తయారైందని విమర్శించారు.
శనివారం జరిగిన గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కార్యకర్తలు పార్టీ గుర్తు, ఇతర ప్రచార సామాగ్రితో పోలింగ్ బూత్‌లలోకి వెళ్లడం, పోలింగ్ రోజున టీవీలు, సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈసీపై విమర్శలు సంధించారు. ఈసీ తీరు సిగ్గుమాలిన, పిరికపంద వ్యవహారమని నిందించారు. సీబీఐ, ఆర్బీఐ తరహాలో ఈసీ కూడా మోదీ ముందు మోకరిల్లిందని అన్నారు. కేజ్రీవాల్ గతంలో సీబీఐ, ఆర్బీఐలను టార్గెట్ చేస్తూ ప్రధాని కార్యాలయం ఆదేశాల మేరకు పనిచేస్తున్నాయని విమర్శించారు. మోదీ తనకు కావాల్సిన వారిని నియమించుకుని ఆర్బీని నాశనం చేసినట్టే ఈసీని కూడా చేశారని ఆరోపించారు. నల్లధనం అరికట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు మోదీ ప్రకటించారని, కానీ గోవా, పంజాబ్ ఎన్నికల్లో బహిరంగంగా పంచిపెట్టారని, నోట్ల రద్దు వల్ల ఏం ప్రయోజనం కలిగిందని కేజ్రీవాల్ ప్రశ్నించారు.