
లాలు ఓకే.. నితీష్ నో
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ హాజరవుతున్నారు.
పట్నా: ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ హాజరవుతున్నారు. కాగా బిహార్‌లో ఆర్జేడీ మిత్రపక్షమైన జేడీ (యూ) నేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదు.
యూపీ రాజధాని లక్నోలో ఈ నెల 5న ఎస్పీ 25వ వ్యవస్థాపక దినోత్సవం జరగనుంది. వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ జనతా పరివార్ నేతలకు ఆహ్వానం పంపారు. కాగా బిహార్ ప్రజలకు ఛాత్ పండగ చాలా ముఖ్యమైదని, ఈ పండగను వదిలి నితీష్ ఎస్పీ కార్యక్రమానికి వెళ్లరని జేడీయూ నేతలు చెప్పారు. ములాయం కుటుంబంలో విభేదాలున్నాయని, ఈ విషయంలో ఏదో ఒక వర్గం వైపు ఉండాలని కోరుకోవడంలేదని తెలిపారు. కాగా లాలు ఎస్పీ కార్యక్రమానికి వెళ్తున్నారని ఆర్జేడీ నేతలు స్పష్టం చేశారు. ములాయం సింగ్కు, లాలుకు బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే.