టికెట్ అడిగినందుకు ఎమ్మెల్యే కొడుకు దాడి
లక్నో: సమాజ్వాది పార్టీ నేతలే కాదు.. వారి పుత్ర సంతానం కూడా రౌడీల్లాగానే ప్రవర్తిస్తున్నారు. ఓ షాపింగ్మాల్లో గార్డుగా చేస్తున్న వ్యక్తిపై ఓ ఎమ్మెల్యే కొడుకు, అతడి స్నేహితులు దారుణంగా దాడి చేశారు. ఏమాత్రం జాలి చూపకుండా పిడిగుద్దులు కురిపించారు. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన తీరు మొత్తం సీసీటీవీ పుటేజ్లో రికార్డయింది.
అసలేం జరిగిందంటే..
లక్నోలోని గోమతి నగర్లో ఓ షాపింగ్ మాల్లోని సినిమా థియేటర్కు ఎస్పీకి చెందిన మున్నీ సింగ్ అనే ఎమ్మెల్యే కుమారుడు ఉగ్రసేన్ ప్రతాప్ సింగ్ అతడి స్నేహితులు వెళ్లారు. అయితే, షాపింగ్ మాల్లో ఓ సెక్యూరిటీ గార్డు ఆ సినిమా టిక్కెట్లు చూపించమని అడిగాడు. దీంతో తమనే టిక్కెట్లు అడుగుతావా అంటూ అతడిపై ఉగ్రసేన్, తన స్నేహితులు విరుచుకుపడి విచక్షణ రహితంగా కొట్టారు.
ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. సీసీటీవీలో ఓ ఎమ్మెల్యే కుమారుడి దౌర్జన్యం స్పష్టంగా కనిపించినా ఎందుకు చర్యలు తీసుకోలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ బహదూర్ పాఠక్ నిలదీశారు. ఆ గార్డు చేసిన తప్పేమిటి, అతడు తన విధులను తాను సక్రమంగా చేశాడు అయినా కొడతారా అని ప్రశ్నించారు.