గతేడాది డిసెంబర్16న దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచార ఘటన కేసుకు సంబంధించిన దర్యాప్తు ద్వారా నేర్చుకున్న పాఠాలను మిగతా ఉన్నతాధికారులతో పంచుకుంటామని న్యూఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సీ వెల్లడించారు. నిర్భయ కేసులో నిందితులకు ఈ రోజు సాకేత్లోని న్యాయస్థానంలో నిందితులకు శిక్ష ఖరారు కానుంది.
ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం ఉదయం కోర్టుకు విచ్చేశారు. ఈ సందర్బంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... భవిష్యత్తులో ఇటువంటి కేసులపై విచారణకు నిర్భయ దర్యాప్తు చేసిన విధానం ఉపకరిస్తుందన్నారు. నిర్భయ కేసు దర్యాప్తునకు సంబంధించి అన్ని శాస్త్రీయ విధానాలు పాటించామన్నారు. అలాగే తమ శక్తి మేరకు సాక్ష్యాలను సంపాదించామన్నారు. అత్యాచార కేసులో నలుగురు నిందితులను పోలీసులు సాకేత్ కోర్టుకు తీసుకువచ్చారు. అయితే నిందితులను కోర్టు ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు విచారించి శిక్ష ఖరారు చేయనుంది.