లోకేష్ నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి: కేఈ
లోకేష్ నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న యాత్రకు మంచి స్పందన వస్తోందని తెలిపారు. అందుకే తెలుగుదేశం పార్టీలో లోకేష్కు మంచి స్థానం కల్పించాలని కేఈ కోరారు. ఇక భోగాపురంలో ఎయిర్పోర్టుకు భూసేకరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేఈ చెప్పారు. భూసేకరణ చట్టానికి పార్లమెంటులో తుదిరూపు వచ్చిన తర్వాతే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
రెవెన్యూ అధికారులు అసలు గ్రామాల్లోకి వెళ్లడం లేదని, రెవెన్యూ శాఖలో త్వరలోనే సంస్కరణలు చేపడతామని చెప్పారు. ఎమ్మార్వో, వీఆర్వోలను సొంత రెవెన్యూ డివిజన్లలో ఉండనిచ్చేది లేదని స్పష్టం చేశారు. రాజధానిలో కూడా గ్రామకంఠాల వివాదాలు ఉన్నాయని, బీపీఎల్ కేటగిరీకి చెందినవారి ఆధీనంలో ఉన్న గ్రామకంఠాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేఈ చెప్పారు. మిగిలిన వాళ్ల ఆధీనంలో ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆయన వివరించారు.