ట్రంప్ భార్యకు భారీ మూల్యం!
లండన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి, ఫస్ట్‌లేడీ మెలానియా.. గతంలో వ్యభిచార వృత్తిలో (ఎస్కార్ట్)ఉన్నట్లు ఆరోపిస్తూ వివాదాస్పద కథనం రాసిన డెయిలీ మెయిల్ పత్రిక, మెయిల్ ఆన్‌లైన్ వెబ్‌సైట్లు మరోసారి క్షమాపణలు చెప్పాయి. సదరు కథనాలపై రూ.1000 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఫస్ట్‌లేడీ మెలానియాతో ఎట్టకేలకు రాజీ ఒప్పందం కుదుర్చుకుదిరిందని డెయిలీ మెయిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆమె(మెలానియా) ఎస్కార్ట్‌గా ఉన్నట్లుగానీ, ట్రంప్‌ను తొలిసారిగా ఎప్పుడు కలిశారనేదానిపైగానీ తాము ప్రచురించిన కథనం సత్యదూరమని, తప్పుడు కథనం ప్రచురించినందుకుగానూ మెలానియాకు మరోసారి క్షమాపణలు చెబుతున్నామని పత్రికా ప్రతినిధులు పేర్కొన్నారు.
ఏమిటీ వివాదం?: డొనాల్డ్ ట్రంప్‌తో పరిచయానికి ముందు.. 1990 దశకంలో మెలానియా వ్యభిచార వృత్తిలో (ఎస్కార్ట్)ఉన్నారని, ఆమె పనిచేసిన మోడలింగ్ ఎజెన్సీ నిర్వాహకుడే ఈ విషయాన్ని వెల్లడించారని గత ఆగస్టులో డెయిలీ మెయిల్, మెయిల్ ఆన్‌లైన్ సహా నాలుగు వార్తాసంస్థలు కథనాలు ప్రచురించాయి. ఈ కథనాలు నూటికి నూరు శాతం అబద్దాలేనని, వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్ఠ దారుణంగా దెబ్బతీసేవిగా ఉన్నాయని మండిపడ్డ మెలానియా.. ఆ పత్రికలపై మేరీలాండ్ కోర్టులో భారీ పరువు నష్టం దావా వేశారు.
మెలానియా దావా దాఖలు చేసిన వెంటనే డైలీమెయిల్ సహా మిగతా పత్రికలు ఆ కథనాన్ని తొలిగించి క్షమాపణలు చెప్పాయి. క్షమాపణ చెప్పినప్పటికీ తన క్లయింట్ కేసును ఉపసంహరించుకోబోరని మెలానియా తరఫు న్యాయవాది హార్డర్ స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీలేక భారీ మూల్యం చెల్లించుకుని రాజీపడ్డారు. కాగా, మెలానియా డిమాండ్ చేసిన 150 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.1000 కోట్ల) కాకుండా కేవలం 2.9 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.19 కోట్లు) మాత్రమే చెల్లించేందుకు డైలీ మెయిల్ అంగీకరించిందని కొందరు, కాదూ భారీ మొత్తాన్నే చెల్లించారని ఇంకొందరు ప్రతిస్పందించారు.