ప్రేమించకుంటే ఆ ఫొటోలు పోస్ట్ చేస్తా..
చెన్నై: ఫేస్‌బుక్‌లో అశ్లీల చిత్రాలతో ఆత్మహత్య చేసుకున్న సేలం జిల్లా యువతి వినుప్రియ దయనీయ ఉదంతం నుంచి తమిళనాడు ఇంకా తేరుకోకముందే మరో యువకుడు అలాంటి బెదిరింపులకే పాల్పడ్డాడు. అయితే పోలీసులు వెంటనే స్పందించడంతో కటకటాల పాలయ్యాడు. తిరునెల్వేలి జిల్లా కడైయనల్లూరు సమీపం కృష్ణాపురానికి చెందిన 23 ఏళ్ల యువతి సెల్‌ఫోన్‌కు కొన్ని నెలల క్రితం దిండుగల్లు జిల్లా సానర్‌పట్టికి చెందిన కాళిదాస్ (25) అనే యువకుడు మిస్డ్‌కాల్ ఇచ్చాడు. అప్పటి నుంచి స్నేహం పేరుతో తరచూ ఆమెకు ఫోన్లు చేసేవాడు.
ఆ యువతి సైతం స్నేహపూర్వకంగా మాటలు కొనసాగించింది. ఈ దశలో తాను ప్రేమిస్తున్నానని గత వారం ఫోన్‌లో చెప్పగా ఆ యువతి నిరాకరించింది. ఆగ్రహించిన యువకుడు తన ప్రేమను అంగీకరించకుంటే ఫొటోను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో పెడతానని యువతిని బెదిరించాడు. భయపడిన యువతి నల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కాళిదాస్‌ను అరెస్ట్ చేసి, పాళయంగోట్టై సెంట్రల్ జైల్లో పెట్టారు.