తండ్రిని చంపి.. సిలిండర్ పేల్చి..
తండ్రిని చంపి.. సిలిండర్ పేల్చి..
Published Sun, Jan 8 2017 7:31 PM | Last Updated on Thu, Jul 11 2019 8:34 PM
అతడు గతంలో మర్చంట్ నేవీలో పనిచేసి సస్పెండయ్యాడు. ఎందుకో గానీ.. కన్న తండ్రిని గొంతు కోసం చంపేశాడు. తర్వాత ఇంట్లోని గ్యాస్ సిలిండర్‌ను పేల్చడం ద్వారా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ ప్రయత్నంలో పదిమంది పోలీసులకు గాయాలయ్యాయి. ఇదంతా తూర్పు ఢిల్లీలోని మధు విహార్ ప్రాంతంలో జరిగింది. రవీందర్ మట్టా అనే పెద్దాయన తన కొడుకు రాహుల్ ప్రవర్తన బాగోలేదని అతడిని దూరం పెట్టారు. తాను నివసించే పరిసర ప్రాంతాల్లోకి కూడా రావొద్దని హెచ్చరించారు.
అయితే... రాహుల్ ఎలాగోలా ఇంట్లోకి ప్రవేశించి, తన తండ్రిని గొంతుకోసి చంపేశాడు. ఆ ఘటన జరిగే సమయానికి నిందితుడి తల్లి ఇంట్లో లేరు. పోలీసులకు సమాచారం అంది, అక్కడకు వచ్చేసరికి రాహుల్ మరో ఫ్లాట్‌లోకి పారిపోయి, అందులో ఉన్న వాళ్ల మీద కూడా దాడి చేశాడు. పోలీసులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. కిచెన్‌లోకి వెళ్లి, తలుపులు లోపలినుంచి వేసుకుని గ్యాస్ స్టవ్ నాబ్‌లు ఓపెన్ చేశాడు. పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లబోగా, అగ్గిపెట్టె వెలిగించాడు. దాంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దాంతో ముగ్గురు ఎస్ఐలు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఏడుగురికి స్వల్పగాయాలయ్యాయి. రాహుల్ చేతికి కాలినగాయాలయ్యాయి.
Advertisement