3800 కోట్లు: భారీ షాకిచ్చిన కరెంట్ బిల్!
జెంషెడ్‌పూర్: అక్షరాల రూ. 3800 కోట్లు.. ఇది ఒక సామాన్యుడికి వచ్చిన కరెంటు బిల్లు. మూడు గదులు, మూడు ఫ్యాన్లు, ఒక టీవీ ఉన్న తనకు కలలో సైతం ఊహించనిరీతిలో కరెంటు బిల్లు రావడం షాక్ అవ్వడం అతని వంతైంది. జెషెండ్‌పూర్‌లో నివసించే బీఆర్ గుహాకు ఆదివారం జార్ఖండ్ విద్యుత్ బోర్డు ఈ కరెంటు బిల్లు పంపింది. ఆ వెంటనే బిల్లు చెల్లించడం లేదంటూ ఇంటికి పవర్ కట్ చేసింది. దీంతో బిత్తరపోయిన బీఆర్ గుహా తన గోడును మీడియాకు వెళ్లబోసుకున్నాడు.
'కరెంటు బిల్లు చూసి నేను విస్తుపోయాను. ఇంతమొత్తం వస్తుందని మేం ఊహించలేదు. మాకు మూడు గదుల ఇల్లు ఉంది. ఇంట్లో మూడు ఫ్యాన్లు, మూడు ట్యూబ్‌లైట్లు, ఒక టీవీ ఉన్నాయి. ఈ మాత్రం దానికి ఇంతమొత్తం బిల్లు ఎలా వస్తుంది?' అని బిహార్ గుహా ప్రశ్నించారు. గుహా కూతురు రత్న బిశ్వా మాట్లాడుతూ 'మా అమ్మకు షూగర్ ఉంది. నాన్నకు రక్తపోటు (బీపీ) ఉంది. ఇరుగుపొరుగువారి సాయంతో ఇంటిని నెట్టుకొస్తున్నాం. ఇలాంటి సమయంలో ఈ బిల్లు మాకు షాక్ ఇచ్చింది' అని తెలిపారు. ఈ విషయమై జార్ఖండ్ విద్యుత్ బోర్డుకు ఫిర్యాదు చేయడంతో పరిశీలిస్తామని బోర్డు హామీ ఇచ్చింది.