బలైన రైతులు.. కమిషన్‌ న్యాయం చెప్తుందా? | Mandsaur firing, govt appoints single member commission | Sakshi
Sakshi News home page

బలైన రైతులు.. కమిషన్‌ న్యాయం చెప్తుందా?

Published Thu, Jun 15 2017 4:52 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 PM

బలైన రైతులు.. కమిషన్‌ న్యాయం చెప్తుందా?

బలైన రైతులు.. కమిషన్‌ న్యాయం చెప్తుందా?

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌ కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించిన సంఘటనపై దర్యాప్తునకు రాష్ట్రంలో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నియమించిన ఏకసభ్య కమిషన్‌ న్యాయం చెబుతుందా? చెప్పినా అది వెలుగులోకి వస్తుందా? వచ్చినా దాని మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గడిచిన దశాబ్దకాలంలో దాదాపు డజను కమిషన్లను వేసింది. అందులో పది కమిషన్లు శివరాజ్‌ సింగ్‌ ప్రభుత్వం వేసినవే. కొన్ని కమిషన్లు ఇప్పటికీ తమ దర్యాప్తు నివేదికలను ప్రభుత్వానికి సమర్పించలేదు. కొన్ని కమిషన్లు సమర్పించినా వాటిని ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకురాలేదు. సామాజిక ఉద్యమాల వల్ల ఒకటి, రెండు కమిషన్ల నివేదికలు వెలుగులోకి వచ్చినా ఒక్కదానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
 
ఎప్పటిలాగే ఈసారి కూడా సిట్టింగ్‌ జడ్జీతో కాకుండా రిటైర్డ్‌ జడ్జీ ఎస్‌కే జైన్‌తో పోలీసు కాల్పుల్లో రైతులు మరణించిన సంఘటనపై దర్యాప్తునకు ఏకసభ్య కమిషన్‌ను వేశారు. జస్టిస్‌ ఎస్‌కే జైన్‌ మొన్న జనవరి నెలలో రాష్ట్ర హైకోర్టు ఇండోర్‌ బెంచీ నుంచి రిటైర్డ్‌ అయ్యారు. రైతుల ఆందోళనను అణచివేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హోం మంత్రి భూపేంద్ర సింగ్‌ మొదటిసారి స్పందిస్తూ రెండు సంఘ విద్రోహ శక్తుల ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారని చెప్పారు. ఆరో రైతు ఆ మరుసటి రోజు ఆస్పత్రిలో మరణించారు. కాల్పులకు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనను తీవ్రతరం చేయడం, మీడియా విమర్శలు గుప్పించడంతో భూపేందర్‌ సింగ్‌ మూడో రోజు పోలీసు కాల్పుల్లోనే రైతులు మరణించిన విషయాన్ని అంగీకరించారు. అయినప్పటికీ మరణించిన వారిలో డ్రగ్‌ స్మగ్లర్లు ఉన్నారంటూ మంద్‌సౌర్‌ ఎస్పీ మనోజ్‌ కుమార్‌ సింగ్‌ ఆరోపిస్తూ వస్తున్నారు. ఆయన మాటలే నిజమైతే కాల్పుల్లో మరణించిన రైతు కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఎందుకు ప్రకటిస్తారు?

అసలు సమస్యను పక్కదారి పట్టించేందుకే కాల్పుల సంఘటనపై విచారణకు ఏకసభ్య కమిషన్‌ను వేశారని నేషనల్‌ సెక్యులరిజమ్‌ ఫోరమ్‌ కన్వీనర్‌ లజ్జా శంకర్‌ హర్దేనియా ఆరోపించారు. ‘కమిషన్‌ ఆఫ్‌ జుడీషియల్‌ ఇంక్వైరీ యాక్ట్‌’ కింద ప్రభుత్వాలు విచారణ కమిషన్లు వేస్తుంటాయి. ఈ కమిషన్లు ఇచ్చిన నివేదికలను తప్పనిసరిగా బహిర్గతం చేయాలన్న నిబంధన చట్టంలోనే లేదు. అందుకని ప్రభుత్వాలు కమిషన్ల తంతును తూతూ మంత్రంగా నిర్వహిస్తాయి.

సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని వందల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలను విచారించిన ఎస్‌కే ఝా కమిషన్‌ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2008, అక్టోబర్‌ నెలలో మధ్యప్రదేశ్‌ హైకోర్టు జస్టిస్‌ ఝా కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్‌ తన నివేదికను చౌహాన్‌ ప్రభుత్వానికి సమర్పించగా, గతేడాది ఫిబ్రవరిలో దాన్ని రాష్ట్ర అసెంబ్లీ ముందుంచారు. ఇప్పటికీ ఆ నివేదికలో ఏముందో బహిర్గతం చేయలేదు. ఈ వివేదికను ప్రజల ముందుంచాలంటూ నర్మదా బచావో ఆందోళన్‌ నాయకురాలు, సామాజిక కార్యకర్త మేథోపాట్కర్‌ ఇప్పటికీ ఆందోళన చేస్తున్నారు.

సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్ట్‌ పేరిట 3,000 నకిలీ భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయని, నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల కేటాయింపుల్లో కోట్లాది రూపాయల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో నాడు జస్టిస్‌ ఝా కమిషన్‌ను వేశారు. విచారణ ఎదుర్కొంటున్న ఎనిమిది మంది అనుమానిత సిమీ కార్యకర్తలు భూపాల్‌ సెంట్రల్‌ జైలు నుంచి తప్పించుకొని పారిపోతూ పోలీసుల కాల్పుల్లో మరణించారు. గతేడాది జరిగిన ఈ సంఘటపై సామాజిక కార్యకర్తలు, మీడియా స్పందించి, అది బూటకపు ఎన్‌కౌంటర్‌ అంటూ పెద్ద పెట్టున గోల చేయడంతో చౌహాన్‌ దానిపైనా రిటైర్డ్‌ హైకోర్టు జడ్జీ ఎస్‌కే పాండే నాయకత్వాన ఓ విచారణ కమిషన్‌ను వేశారు. బూటకపు ఎన్‌కౌంటర్‌ను సమర్థించేందుకు అందులో మరణించినవారు అత్యంత కరడుగట్టిన టెర్రరిస్టులని చౌహాన్‌ వాదిస్తూ వచ్చారు. మొన్న మార్చి నెలకు పాండే కమిషన్‌ కాల పరిమితి ముగియడంతో మరో మూడు నెలలు పొడిగించారు.

బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజయ వర్గీయ 2000 సంవత్సరంలో ఇండోర్‌ మేయర్‌గా ఉన్నప్పుడు ఆ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో జరిగిన భారీ పింఛను స్కామ్‌పై జస్టిస్‌ ఎన్‌కే జైన్‌ కమిషన్‌ విచారణ జరిపిన ఫైలు నేటికీ, అంటే 16 ఏళ్ల అనంతరం కూడా రాష్ట్ర హోం శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోవాలంటే ఎన్నో ఇలాంటి ఉదంతాలు ఉన్నాయి. మొన్నటి కాల్పుల్లో చనిపోయిన రైతులు ఎలాగు తిరిగొచ్చే అవకాశం లేదుకనుక కోటి రూపాయల కోసం వారి కుటుంబాలు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో రాజీపడినట్లు కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement