
సినిమాల వల్ల నేరాలు పెరుగుతున్నాయి
న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై నేరాలు పెరగడానికి సినిమాలే కారణమని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ విమర్శించారు. సినిమాల్లో మహిళలను ఉన్నతంగా, గౌరవంగా చూపించాలని సినీ పరిశ్రమ ప్రముఖులను ఆమె కోరారు.
'సినిమాలలో మహిళల పట్ల మగవాళ్లు హింసాత్మకంగా ప్రవర్తిస్తారు. సినిమాలను గమనిస్తే చాలా వరకు ఈవ్ టీజింగ్‌తో రొమాన్స్ మొదలవుతుంది. హీరో, అతని స్నేహితులు ఓ అమ్మాయి చుట్టూ చేరి ఆటపట్టిస్తారు. ఆమెను ఏడిపించడం, అనుచితంగా తాకడం వంటి పనులు హీరో చేస్తాడు. తర్వాత ఆమె నిదానంగా ప్రేమలో పడుతుంది. బాలీవుడ్, ప్రాంతీయ భాషా సినిమాల్లో ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయి. మహిళలను కించపరిచేలా, అమర్యాదగా చూపిస్తారు. ఇలాంటి సినిమాలు చూడటం వల్ల యువకులు అమ్మాయిల పట్ల ఇలాగే ప్రవర్తిస్తారు. మహిళలపై హింస పెరగడానికి ఇలాంటి సినిమాలే కారణం' అని మేనకా గాంధీ అన్నారు.