మారుతీ కొత్త కారు స్టింగ్‌రే
న్యూఢిల్లీ: మారుతీ సుజుకి కంపెనీ కాంపాక్ట్ కార్ సెగ్మెంట్లో కొత్త మోడల్, స్టింగ్‌రేను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. 998 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో మూడు వేరియంట్లలో లభించే ఈ కారు ధరలను రూ. 4.1 లక్షలు నుంచి రూ. 4.67 లక్షల రేంజ్‌లో(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతమున్న వ్యాగన్ ఆర్ కారు కంటే ఈ కారు ధర రూ. 20,000 అధికం. త్వరలో సీఎన్‌జీ మోడల్‌ను కూడా అందించనున్నది.
కారు ప్రత్యేకతలు
3 సిలిండర్ ఇంజిన్‌తో కూడిన ఈ కారు 20.5 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని అంచనా. ఈ సెగ్మెంట్ కార్లలో ఏ కంపెనీ కారుకు లేనటువంటి ప్రాజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఈ కారులో ఉన్నాయి. ఇక హై ఎండ్ మోడల్‌లో అడ్జెస్టబుల్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టబుల్ రియర్ వ్యూ మిర్రర్స్, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, రెండు ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ వంటి ప్రత్యేకతలున్నాయి. వాహనాల అమ్మకాలు మందకొడిగా ఉన్నప్పటికీ, వినియోగదారులు మారుతీ కార్లను కొనడాన్ని కొనసాగిస్తున్నారని మారుతీ సుజుకి ఇండియా ఎండీ, సీఈవో కెనిచి అయుకవ చెప్పారు. యువ వినియోగదారులు లక్ష్యంగా, కొత్త మోడళ్లను అందించే వ్యూహంలో భాగంగా స్టింగ్‌రే కారును మార్కెట్లోకి తెచ్చామని పేర్కొన్నారు.