సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళ్లి పవిత్ర మక్కా మసీదు వద్ద జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య నాలుగుకు పెరిగింది. మక్కా మసీదు విస్తరణ పనుల్లో వినియోగిస్తున్న భారీ క్రేన్ కుప్పకూలడంతో గత శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా హజ్ యాత్రకు వెళ్లిన మచిలీపట్టణానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ ఖాదర్(38), ఫాతీమాబీ(32) దంపతులు ఈ ఘటనలో మృతిచెందినట్లు ఇప్పటికే ప్రభుత్వం ధ్రువీకరించింది.
కాగా, మృతుల్లో కర్ణాటకకు చెందిన షమీమ్ బాను, ఖాదర్ బీ అనే మహిళలు సైతం ఉన్నట్లు సోమవారం గుర్తించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు టూర్ ఆపరేటర్ ద్వారా హజ్ యాత్రకు వెళ్లడంతో వీరిద్దరినీ నగరవాసులుగా భావించారు. అనంతరం వీరిద్దరూ కర్ణాటకవాసులని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. కాగా, ఈ నలుగురి అంత్యక్రియలను ఆనవాయితీ ప్రకారం పవిత్ర మక్కా మసీదులోనే జరపాలని వారి కుటుంబ సభ్యులు కోరుకున్నారు.
ఈ నేపథ్యంలో అక్కడే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అంత్యక్రియలకు హాజరు కావడానికి మృతుల బంధువులను మక్కాకు పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఇదే ప్రమాదంలో గాయాలపాలైన నాంపల్లి బజార్‌ఘాట్‌కు చెందిన మహమ్మద్ హమీద్ ఖాన్, ఆయన భార్య అనీస్‌లు కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భవానీ నగర్‌కు చెందిన షేక్ మహమ్మద్ ముజీబ్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వాస్తవానికి మక్కా ప్రమాదంలో మృతిచెందిన వారి మృతదేహాలను హైదరాబాద్‌కు తీసుకురావాలా? అక్కడే అంత్యక్రియలు చేయాలా? అన్న దానిపై హజ్ కమిటీ మృతుల బంధువులతో సంప్రదించిం ది. పవిత్ర మక్కాలో అంత్యక్రియలు జరపడం అదృష్టమనే విశ్వాసంతో అక్కడే అంత్యక్రియలు చేయాలని బంధువులు కోరారు.
మక్కాలోనే అంత్యక్రియలు
Published Tue, Sep 15 2015 1:57 AM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM
Advertisement
Advertisement