మీరాకుమార్ నామినేషన్ దాఖలు
♦ హాజరైన సోనియా,మన్మోహన్, విపక్షాల నేతలు
♦ సైద్ధాంతిక పోరాటం మొదలైందన్న మాజీ స్పీకర్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక కోసం విపక్షాల అభ్యర్థి, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్, ఇతర విపక్షాల అగ్రనేతల సమక్షంలో ఆమె పార్లమెంట్ హౌస్‌లో రిటర్నింగ్ అధికారి అయిన లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డి.రాజా(సీపీఐ), కనిమొళి(డీఎంకే), నరేశ్ అగర్వాల్(ఎస్పీ), సతీశ్‌చంద్ర మిశ్రా (బీఎస్పీ), డెరెక్ ఓబ్రియాన్(తృణమూల్ కాంగ్రెస్) తదితరులు హాజరయ్యారు.
సోనియా, మన్మోహన్, ఇతర కాంగ్రెస్ నేతలు, మాజీ ప్రధాని దేవెగౌడ, విపక్షాల నేతలు మీరా అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించి, బలపరిచారు. ‘ఈ రోజు నుంచి మా సైద్ధాంతిక పోరాటం ప్రారంభమైంది. ప్రజాస్వామిక విలువలు, అందరినీ కలుపుకునిపోవడం, పత్రికాస్వేచ్ఛ, వ్యక్తుల స్వేచ్ఛ, పేదరిక నిర్మూలన, పారదర్శకత, కులవ్యవస్థ నిర్మూలన మా సిద్ధాం తానికి ఆధారం’ అని ఆమె అన్నారు. ‘పేదలు, అట్టడుగువర్గాలను పట్టిం చుకోకుండా మనల్ని సంకుచితత్వం వైపు తీసుకెళ్లే దారి ఒకటుంది.
దళితులు, పేదలు, అణగారిన వర్గాలు, మహిళలు, కార్మికులు, అన్ని మతాల ప్రజల అభ్యున్నతికి బాటలు వేసే మరో మార్గం ఉంది. అంతరాత్మ మాట విని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నా’ అని ఎలక్టోరల్ కాలేజీ సభ్యులను ఉద్దేశించి ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ నెల 30న గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తానన్నారు. కాగా, ఈ ఎన్నికల కోసం మొత్తం 95 మంది నామినేషన్లు వేశారు. వీరిలో 150 ఎన్నికల్లో పోటీ చేసిన గిన్నిస్ రికార్డులకెక్కిన తమిళనాడు వాసి కె.పద్మరాజన్ కూడా ఉన్నారు.