
విదేశీ మార్కెట్లపై మైక్రోమ్యాక్స్ కన్ను
న్యూఢిల్లీ/ముంబై: మైక్రోమ్యాక్స్ ఐదేళ్ల క్రితం చైనా తయారీ ఫోన్‌ను రూ.1,800కు విక్రయించింది. ఫ్లిప్ చేస్తే ఇప్పుడు దేశంలోనే నంబర్ 2 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా ఎదిగింది. ఇంట గెలిచిన ఈ కంపెనీ ఇప్పుడు రచ్చ గెలవాలనుకుంటోంది. శామ్‌సంగ్, నోకియా వంటి కంపెనీలు రాజ్యమేలుతున్న మార్కెట్లలోకి పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. మాస్‌కు చేరువలో స్మార్ట్‌ఫోన్‌లు ఐటీ సాఫ్ట్‌వేర్, టెలికామ్ గేర్‌ల వ్యాపారం చేసే ఈ కంపెనీ మొదట చౌక ధరల ఫోన్లతో మొబైల్ మార్కెట్లోకి ప్రవేశించింది. డ్యుయల్ సిమ్ ఫోన్లను అందుబాటులోకి తేవడం, పెద్ద స్క్రీన్ ఫోన్లను చౌక ధరలకే అందించడం వల్ల మొబైల్ మార్కెట్లో మైక్రోమ్యాక్స్ క్లిక్ అయింది. స్మార్ట్‌ఫోన్‌లను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చిన ఘనత మైక్రోమ్యాక్స్‌దే.
గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్
ఇక ఇప్పుడు మైక్రోమ్యాక్స్ తన మార్కెట్‌ను విస్తృతం చేసుకోవాలనుకుంటోంది. భారత కంపెనీలు సాధారణంగా బ్రాండ్ అంబాసిడర్‌లుగా క్రికెటర్లను, హిందీ సినిమా నటులను నియమించుకుంటాయి. ఈ రివాజుకు భిన్నంగా మైక్రోమ్యాక్స్ కంపెనీ ఇక బ్రాండ్ అంబాసిడర్‌గా హాలీవుడ్ హీరో హ్యూ జాక్‌మన్‌ను నియమించుకుంది. విదేశీ విస్తరణ దృష్టితోనే జాక్‌మన్‌ను కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నదని నిపుణులంటున్నారు.