టీడీపీకి ఎదురు దెబ్బ | Migrations to be continued from TDP to TRS | Sakshi

టీడీపీకి ఎదురు దెబ్బ

Feb 26 2014 3:05 AM | Updated on Aug 15 2018 9:17 PM

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి.

టీఆర్‌ఎస్‌లోకి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ
కేసీఆర్‌తో  మహేందర్‌రెడ్డి, కేఎస్ రత్నం, నరేందర్‌రెడ్డి భేటీ

 సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ పార్టీకి రాజీనామాలు చేసి టీఆర్‌ఎస్‌లో చేరగా.. ఇటీవలే బోథ్‌కు చెందిన టీడీపీ ఎమ్మెల్యే సైతం పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.
 
 తాజాగా రంగారెడ్డి జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు మహేందర్‌రెడ్డి, కె.ఎస్.రత్నం, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం సహచరులతో కలసి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో ఢిల్లీలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. టీఆర్‌ఎస్‌లో చేరికకు కేసీఆర్ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్‌తో కలసి పనిచేస్తామని ఆ ముగ్గురు నేతలు ప్రకటించారు.
 
 న్యాయం జరగదనే: కేసీఆర్‌తో భేటీ అనంతరం ఈ ముగ్గురూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘‘తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంగా కేసీఆర్‌ను కలిశాం. త్వరలోనే కార్యకర్తలతో కలసి టీఆర్‌ఎస్‌లో చేరతాం. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యం. ఆయన నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ఆంధ్ర నాయకత్వంతో, ఆ ప్రాంత నేతలతో తెలంగాణకు న్యాయం జరుగదు. ఆ ప్రాంత పార్టీలకు ఇక్కడ చోటులేదు’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమైతే ఏంచేస్తారన్న ప్రశ్నకు..‘‘విలీనం మాకు ముఖ్యం కాదు. ఎక్కడ ఉన్నా గెలవగలిగే సత్తా ఉంది’’ అని బదులిచ్చారు. టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు కేసీఆర్ అంగీకరించారని, వారి రాకతో రంగారెడ్డి జిల్లాలో పార్టీ బలోపేతమవుతుందని టీఆర్‌ఎస్ నేత కె.తారకరామారావు (కేటీఆర్) పేర్కొన్నారు.  
 
 తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్‌ఎస్: కేటీఆర్
 కాంగ్రెస్‌లో పార్టీ విలీనంపై స్పష్టత ఇవ్వకుండానే ఇకపై తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్‌ఎస్ ఉంటుందని కేటీఆర్ వ్యాఖ్యానించటం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్‌లో పార్టీ విలీనంపై అడిగిన ప్రశ్నకు ‘‘పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందాక పార్టీ విలీనం ఉంటుందని కానీ, ఉండదని కానీ చెప్పామా?’’ అని ఎదురు ప్రశ్నించారు. ‘‘ఇకపై టీఆర్‌ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి’’ అని అభివర్ణించారు. పార్టీలో చర్చించాకే విలీనం, పొత్తు అంశాలపై నిర్ణయిస్తామన్నారు.
 
 చంద్రబాబుకు షాక్
 సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు, తాండూరు ఎమ్మెల్యే పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ, పరిగి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పట్నం నరేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కేఎస్ రత్నం  నిష్ర్కమణతో తెలుగుదేశం పార్టీకి రంగారెడ్డి జిల్లాలో ఊహించని షాక్ తగిలింది. తెలంగాణలో టీడీపీనినమ్ముకుంటే రాజకీయ భవిష్యత్ ఉండదనే భయంతో పాటు అధినేత అనుసరిస్తున్న వైఖరి వల్లనే వీరు పార్టీని వీడినట్లు సమాచారం. స్వయంగా చంద్రబాబే జిల్లాల్లో గ్రూపులు ప్రోత్సహించటం కూడా వీరి రాజీనామాకు కారణంగా తెలిసింది.
 
 ఇదే బాటలో మరికొందరు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. గేట్లు ఎత్తివేస్తే తమ  పార్టీలోకి వరదలా నాయకులు ఇతర పార్టీల నుంచి  వెల్లువెత్తుతారని, చాలామంది మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు వస్తారని టీడీపీ నేతలు, ముఖ్యంగా అధినేత చంద్రబాబు ప్రచారం చేస్తున్న దశలో దాన్ని పటాపంచలు చేస్తూ ముఖ్య నేతలు ముగ్గురు పార్టీని వీడటం టీడీపీకి మింగుడుపడటం లేదు. రంగారెడ్డి జిల్లాలో పార్టీ తరపున 2009లో అయిదుగురు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వీరిలో కొప్పుల హరీశ్వర్‌రెడ్డి సుమారు రెండు సంవత్సరాల కిందట పార్టీని వీడారు.  తాజాగా మహేందర్‌రెడ్డి, రత్నం అదే బాటలో నడిచారు. ప్రస్తుతం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, టి. ప్రకాష్ గౌడ్ మాత్రమే పార్టీలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Photos

View all
Advertisement