చేతులెత్తి మొక్కుతున్నా.. ఆత్మహత్యలొద్దు
రైతులను కోరిన మంత్రి పోచారం
గజ్వేల్/వర్గల్: ‘చేతులెత్తి మొక్కుతున్నా.. రైతులు మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఈ సర్కార్ మీకు అండగా ఉం టుంది’ అని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా గజ్వేల్‌లో బుధవారం రైతులకు భూసార కార్డుల పంపిణీకి వచ్చిన ఆయన చేతులు జోడించి చేసిన ఈ విజ్ఞాపనతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది.
రైతు ప్రభుత్వంపై విమర్శలా?
‘గల్లీలో కాదు.. ఢిల్లీలో పోరాటాలు చేయండి. అప్పుడే రైతులకు మేలు చేసినోళ్లవుతరు. రైతుల కోసం పనిచేస్తున్న మా ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తారా?’ అని మంత్రి పోచారం కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణహిత ఎత్తిపోతల పథకంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్పులకు శ్రీకారం చుడుతున్నారని, దీంతో లక్షలాది ఎకరాల భూమిని సస్యశ్యామలం చేయడానికి ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇది జరిగితే తమకు పుట్టగతులు ఉండవని భయపడి కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు.