'విమానం గల్లంతు విద్రోహచర్య కాదేమో'
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఏఎన్-32 అదృశ్యం వెనుక విద్రోహుల హస్తం ఉండకపోవచ్చని, అలా జరిగే అవకాశాలు చాలాచాలా తక్కువని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ అన్నారు. శుక్రవారం రాజ్యసభలో మాట్లాడిన ఆయన గల్లంతైన విమానం ఆచూకీ కోసం కొనసాగుతున్న ఆపరేషన్ వివరాలను సభ్యులకు తెలిపారు. (ఆపరేషన్ తలాష్)
''ఆపరేషన్ తలాష్'ను స్వయంగా నేనే పర్యవేక్షిస్తున్నా. ఇది విద్రోహ చర్య అయ్యే అవకాశాలు చాలా తక్కువ. గల్లంతైన విమానంలో ప్రయాణించిన 29 మందికి చెందిన కుటుంబాలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం' అని పరీకర్ తెలిపారు. ఈ నెల 22న గల్లంతైన ఐఏఎఫ్ ఏఎన్ 32 విమానం గల్లంతై ఎనిమిది రోజులు కావస్తున్నా ఇంతవరకు దాని జాడ తెలియక పోవడంతో అందులో ప్రయాణించిన నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగుల కుటుంబాలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. (భగవంతుడా మాకేంటీ కష్టం..!)
విమానం గాలింపులో రోబోలు
ఇప్పటికే వివిధ శాఖలు విమానం ఆచూకీ కోసం తలపెట్టిన 'ఆపరేషన్ తలాష్' లో నిమగ్నమయ్యాయి. జాతీయ సముద్ర సాంకేతిక పరిశోధనా సంస్థకు చెందిన చక్రనిధి అనే నౌక ద్వారా అత్యాధునిక రోబోలను గురువారం నుంచి గాలింపు పనుల్లో ప్రవేశపెట్టారు. అత్యాధునికమైన ఈ నౌకకు అమర్చే రోబోలు నడిసముద్రంలో ఎంతటి లోతులో ఉన్న వస్తువులనైనా గుర్తించగలవు. (చివరి ప్రయత్నంగా విదేశాల సాయం తీసుకుంటాం) బంగాళాఖాతంపై ఎగురుతున్నప్పుడే విమానం ప్రమాదానికి లోనై ఉంటుంది, విమాన వేగానికి సుమారు 13 వేల అడుగుల లోతుల్లోని ఇసుకలో కూరుకు పోయి ఉండవచ్చని భావిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విమానాన్ని కనుగొనడం అంత సులువు కాదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే రోబోల ప్రవేశం వల్ల కూలిపోయిన విమానం ఆచూకీ లభిస్తుందని నమ్ముతున్నామన్నారు. గత ఏడాది కూలిపోయిన కోస్ట్‌గార్డ్ విమానం శకలాలను సైతం ఈ రోబోల ద్వారానే గుర్తించినట్లు తెలిపారు. (విమానాలను నడుపుతున్న తీరు బాధాకరం)