విమానం టికెట్ కొనడం మరీ ఖరీదైన వ్యవహారంగా భావిస్తున్నారా?
మీరు విహారయాత్రకు వెళ్లాలని ఉంది. కానీ విమానం టికెట్ కొనడం మరీ ఖరీదైన వ్యవహారంగా భావిస్తున్నారా? మీ కన్నా మీ తోటి ప్రయాణికుడికి తక్కువ ధరకు విమానం టికెట్ ఎలా దొరికిందని ఆశ్చర్యపోతున్నారా? తక్కువ ధరకు టికెట్ బుక్ చేసుకోవడానికి ఏమిటి మార్గాలు అన్వేషిస్తున్నారా? అయితే, ఈ టిప్స్ మీకోసమే..
ఒకటే విమానాయాన సంస్థను చెక్ చేస్తున్నారా?
ఈరోజుల్లో విమాన సేవల వెబ్‌సైట్లు, విమాన టికెట్ ధరల యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి ప్రయాణికులు కేవలం ఒకే ఎయిర్‌లైన్స్ సంస్థ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. తక్కువ ధరకు టికెట్ లభిస్తుందని మీరు ఎప్పుడూ ఫలానా ఎక్స్ సంస్థ విమానంలో ప్రయాణిస్తూ ఉండవచ్చు. కానీ మరో ఎయిర్‌లైన్స్ ఆ రూట్‌లో కొత్త సేవలు ప్రారంభించి ఉండవచ్చు. పోటీ కారణంగా మరో సంస్థ ధరలు తగ్గించి ఉండవచ్చు. కాబట్టి ముందుగా చెక్ చేసుకొని.. మిగతా సంస్థల ఆఫర్లపై ఓ లుక్కేసిన తర్వాత టికెట్ బుక్ చేసుకోండి.
ఆకస్మిక.. హడావిడి కొనుగోళ్లు..
విమాన టికెట్లను ఆదరాబాదరాగా బుక్ చేసుకోవడం, ఆకస్మికంగా, అకస్మాత్తుగా కొనుగోలు చేయడం అంత మంచిది పద్ధతి కాదు. మీకున్న ప్రత్యామ్నాయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని.. పోటీ సంస్థల ఆఫర్లన్నింటినీ ఆసారి చూసిన తర్వాత టికెట్ బుక్ చేసుకోండి. ఒకవేళ హడావిడిగా టికెట్ బుక్ చేసుకున్నా దానిని 24 గంటల్లోపు రద్దుచేసుకొనే అవకాశాన్ని చాలా విమానాయాన సంస్థలు ఇస్తున్నాయి కాబట్టి ఆ ఆప్షన్ ను ఉపయోగించుకోవచ్చు.
బుక్ చేసుకోవడంలోనూ మెలుకువ
విమాన టికెట్‌ను సరైన రోజున బుక్ చేసుకోవడం వల్ల కూడా టికెట్ ధరలో ప్రయాణికులకు కలిసి వచ్చే అవకాశముంది. హోప్పర్ అధ్యయనం ప్రకారం గురువారం నాడు దేశీయ టికెట్లు, వీకెండ్స్ (శుక్ర,శని, ఆదివారాల్లో) విదేశీ టికెట్లు బుక్ చేసుకుంటే టికెట్ ధర చాలా చౌకగా లభించే అవకాశముంది. గురువారం నాడు బుక్ చేసుకొనే టికెట్ల ధర విషయంలో బేరసారాలకు కూడా అవకాశముంటుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి.
ప్రత్యామ్నాయ విమానాశ్రయాలపై లుక్ వేయడం..
చాలావరకు ప్రపంచ ప్రముఖ నగరాల్లో ఒకటి కన్నా ఎక్కువ ఎయిర్‌పోర్టులు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు న్యూయార్క్‌లో న్యూవార్క్, జేఎఫ్‌కే, లా గార్డియో విమానాశ్రయలు, లండన్‌లో గేట్‌విక్, సాంస్టెడ్, హిత్రూ, వాషింగ్టన్ డీసీలో రోనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయం, డుల్స్ అంతర్జాయ విమానాశ్రయం, బాల్టీమోర్-వాషింగ్టన్ విమానాశ్రయం వంటివి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, టికెట్ కొనేముందు మీరు వెళ్లే ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ఎయిర్‌పోర్టులు, ఆ ఎయిర్‌పోర్టుల నుంచి మీరు వెళ్లాల్సిన ప్రదేశాలు, ఎక్కడి నుంచి వెళితే ధర కలిసివస్తుందని అన్నది బేరిజు వేసుకొని బెస్ట్ ఆఫర్ ను ఎంచుకోవడం మంచిది.
రూట్ కూడా చూసుకోవాలి!
మీరు హంగేరిలోని బుడాపెస్ట్ వెళ్లాలనుకుంటున్నారు. కానీ అక్కడికి వెళ్లేందుకు ఏ ఎయిర్‌లైన్స్ కూడా ఆఫర్ ఇవ్వడం లేదు. టికెట్ ధర తడిసి మోపడయ్యే అవకాశముంది. అలాంటప్పుడు తెలివైన ప్రయాణికుడు బుడాపెస్ట్ సమీపంలోని ప్రదేశాల్లో ఏమైనా ఆఫర్లు ఉన్నాయా అని వాకబు చేస్తాడు. నేరుగా వెళ్లడం కంటే వియత్నాం నుంచో, మ్యూనిచ్ నుంచో రూట్ మారిస్తే.. ఎంతో కలిసివచ్చే అవకాశం కూడా ఉంటుంది. యూరోపియన్ ఎయిర్‌లైన్స్ చాలావరకు ఆల్ట్రానేట్ డెస్టినేషన్స్‌కు చౌక ధరకే చాలా ఆఫర్లు ఇస్తున్నాయి. ఒక్క యూరప్ అనే కాదు.. మీరు ఎక్కడికి వెళ్లాలనుకున్నా.. ఆ సమీప ప్రాంతాలకు ఏమైనా ఆఫర్లు ఉన్నాయా? నేరుగా కాకుండా రూట్ కొంచెం మార్చడం వల్ల ఏమైనా కలిసి వస్తుందా అన్నది చెక్ చేసుకుంటే బాగుంటుంది.
డేట్స్‌తోనూ కలిసి వస్తుంది
కొన్ని రూట్లలో వచ్చివెళ్లే తేదీల్లో కొద్దిగా మార్పులు చేసుకున్నా.. విమాన ధరల విషయంలో బ్రహ్మాండంగా కలిసి వచ్చే అవకాశముంది. బుధవారాల్లో ముఖ్యంగా డిపార్చర్ పెట్టుకుంటే అంతర్జాతీయ విమానాశ్రయల్లో 60 డాలర్ల వరకు కలిసి వచ్చే అవకాశముంది. అది ఆదివారమైతే తడిసి మోపేడు అవుతుంది. అలాగే అంతర్జాతీయ ప్రయాణాల్లో రిటర్న్ జర్నీకి కూడా బుధవారం బెస్ట్ డేట్ అంటున్నాయి అధ్యయనాలు. దేశీయ ప్రయాణాల్లో మంగళవారం బాగా చౌక ధరకు టికెట్లు దొరికే అవకాశముంది. తేదీల విషయంలో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే పెద్దమొత్తంలో సేవ్ చేసుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.
పన్నులు, ఫీజులు..
ఆఫర్లు ఎలా ఉన్నా అదనపు ఫీజులు, ఎయిర్‌పోర్టు పన్నులు తదితరాలు తడిసి మోపేడయ్యే అవకాశముంది. గతంలో కన్నా వీటి విషయంలో విమాన పరిశ్రమ ఇప్పుడు పారదర్శకత పాటిస్తోంది. కాబట్టి, లగేజ్ ఫీజులు, ఎక్స్‌ట్రా చార్జులు వంటివి ముందే తెలుసుకొని.. మనకు సౌలభ్యంగా ఉన్న ఆప్షన్స్ ఎంచుకోవడం ఉత్తమమైన పద్ధతి.
లేట్ బూకింగ్‌తో చిక్కులే!
ప్రస్తుత రోజుల్లో అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకొని ప్రయాణలు చేయడం అంటే అది మంచి పద్ధతి కాదు. లేట్‌గా బుక్ చేసుకొనే వారికి టికెట్ ధరలు చుక్కలు చూపించే అవకాశముంది. కాబట్టి ఏదైనా విదేశీయానం, విహారయాత్రకు ప్లాన్ చేసుకున్నప్పుడు కనీసం 25రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకోండి. ముందు అన్ని ఆఫర్లను శోధించి.. మీకు చౌకగా, ఆనందంగా ప్రయాణం సాగేలా చూసుకోండి