
బ్రిటన్‌లో మోదీ బిజీ బిజీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్‌లో చేపట్టిన మూడు రోజుల పర్యటన ముగిసింది. టర్కీలో ఆదివారం నుంచి రెండు రోజులపాటు జరగనున్న
♦ బ్రిటన్‌లో ముగిసిన ప్రధాని పర్యటన
♦ లండన్‌లో అంబేడ్కర్, బసవేశ్వర స్మారకాల ఆవిష్కరణ
♦ టాటా మోటార్స్ జాగ్వార్ కార్ల ఫ్యాక్టరీ సందర్శన
♦ జీ 20 కోసం టర్కీకి పయనం
లండన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్‌లో చేపట్టిన మూడు రోజుల పర్యటన ముగిసింది. టర్కీలో ఆదివారం నుంచి రెండు రోజులపాటు జరగనున్న జీ20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు శనివారం రాత్రి ఆయన టర్కీకి బయలుదేరారు. ఫ్రాన్స్‌లో ఉగ్ర దాడి నేపథ్యంలో ఉగ్ర పోరు ప్రధాన ఎజెండాగానే జీ20 సదస్సు జరిగే అవకాశం ఉంది. అంతకుముందు బ్రిటన్ పర్యటనలో చివరిరోజైన శనివారం కూడా మోదీ బిజీబిజీగా గడిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, 12వ శతాబ్ది భారత తత్వవేత్త, సంఘ సంస్కర్త బసవేశ్వర స్మారకాలను లండన్‌లో ఆవిష్కరించారు. అలాగే ఇంగ్లాండ్‌లోని పశ్చిమ మిడ్‌ల్యాండ్స్ ప్రాంతంలో టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్ల ఫ్యాక్టరీని సందర్శించారు. టాటా గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ తదితరులు మోదీ వెంట ఉన్నారు.
అంబేడ్కర్‌కు నివాళి... బసవేశ్వర ఆదర్శాలకు కితాబు
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 1920-21లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకునే రోజుల్లో నివసించిన మూడంతస్తుల ఇంటిని మోదీ సందర్శించారు. ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ స్మారకాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఆ రాష్ట్ర సామాజికశాఖ మంత్రి రాజ్‌కుమార్ బడోలేలతో కలసి ఆవిష్కరించి నివాళులర్పించారు. ఆ ఇంటిని భారత ప్రభుత్వం రెండు నెలల కిందట సుమారు రూ. 26 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసి మ్యూజియంగా మార్చింది. అలాగే లండన్‌లోని వాక్స్‌హాల్ ప్లెషర్ గార్డెన్‌లో బసవేశ్వర స్మారకాన్ని ఆవిష్కరించారు. 12వ శతాబ్ది నాటి ఇంగ్లండ్ రాజు వద్ద పనిచేసిన మాగ్నా కార్టాకన్నా ముందు ప్రపంచానికి ప్రజాస్వామ్య ఆదర్శాలను బసవేశ్వర అందించారని కొనియాడారు. కాగా, బ్రిటన్ లేబర్ పార్టీ నేత, ప్రతిపక్ష నాయకుడు జెరెమి కార్బిన్ శనివారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. భారత్‌లో మానవహక్కుల ఉల్లంఘనలపై మోదీని నిలదీయాలంటూ బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌కు వినతిపత్రం సమర్పించిన 46 మంది బ్రిటిష్ ఎంపీల్లో కార్బిన్ కూడా ఒకరు కావడం గమనార్హం. బ్రిటన్ పార్లమెంటును ఉద్దేశించి మోదీ ప్రసంగించినప్పుడు కార్బిన్ గైర్హాజర య్యారు.
మోదీకి రంగుల దుప్పటి బహుమతి
బ్రిటన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయ మహిళలు వినూత్న బహుమతిని అందించారు. మోదీ బస చేసిన హోటల్‌లో ఆయన్ను కలుసుకున్న ఇండియన్ లేడిస్ ఇన్ యూకేకు చెందిన ప్రతినిధులు 2,500 చదరపు అల్లికలతో చేసిన రంగురంగుల దుప్పటిని ఆయనకు బహూకరించారు. భారతదేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పేందుకు 4 వేల మందికిపైగా మహిళలు దీన్ని రూపొందించారు. తనకు ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చిన బ్రిటన్‌కు, తన పర్యటనలో వెన్నంటి ఉన్న కామెరాన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 126వ జయంతి సందర్భంగా ఆయనకు ట్విటర్‌లో నివాళి అర్పించారు.
రాజస్థాన్ టీచర్‌ను కొనియాడిన మోదీ
జైపూర్: రాజస్థాన్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడిని ప్రధాని నరేంద్ర మోదీ లండన్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ప్రవాస భారతీయుల సభలో పొగి డారు. విద్యార్థుల కోసం ఎలాంటి ఖర్చు లేని 52 యాప్స్ రూపొందించారని, అలాంటి వారిలోనే ఇండియా ఉందని తన ప్రసంగంలో కొనియాడారు. ఈ నేపథ్యంలో కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ శనివారం ఇమ్రాన్‌ఖాన్‌కు ఫోన్ చేసి అభినందించారు. ఢిల్లీకి రావాలని ఆహ్వానించారు. మంత్రి ఆదేశాల మేరకు బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాత్సవ్ రాజస్థాన్‌లోని అల్వార్ బీఎస్‌ఎన్‌ఎల్ జీఎంను ఇమ్రాన్‌ఖాన్ వద్దకు పంపారు.
ఈ మేరకు అభినందనలు తెలిపి జీవితకాలం ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. తాను ఇంగ్లిష్, హిందీ, జీకే, మాథ్స్ సబ్జెక్టులపై యాప్స్ రూపొందించానని తెలిపారు. తాను సంస్కృతి టీచర్‌నని, హిందీ మీడియం విద్యార్థుల కోసం జీకే టాక్ అనే వెబ్‌పోర్టల్‌ను నడుపుతున్నానని ఇమ్రాన్‌ఖాన్ తన వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ‘లండన్‌లో ప్రధాని మోదీ నా గురించి గొప్పగా చెప్పిన విషయాన్ని మిత్రుల ద్వారా తెలుసుకున్నాను. నేను చేసిన చిన్న ప్రయత్నం గురించి లండన్‌లో మాట్లాడడం గర్వంగా ఉంది. నేను 2012 నుంచి యాప్స్ రూపొందిస్తున్నాను. నాకు కంప్యూటర్ పరిజ్ఞానం లేదు. కాని కంప్యూటర్‌పై ఎక్కువ సమయాన్ని వెచ్చించి వెబ్‌సైట్స్ రూపొందించడంపై కసరత్తు చేశాను.’ అని ఇమ్రాన్‌ఖాన్ వివరించారు.