
'మోదీ దేవుడినీ మోసం చేశారు'
అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బిహార్ కు ప్రధాని నరేంద్ర మోదీ రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ ఆరోపించారు.
పాట్నా: అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బిహార్ కు ప్రధాని నరేంద్ర మోదీ రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ ఆరోపించారు. 15 నెలల నుంచి బిహార్ ను విస్మరించిన మోదీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్యాకేజీ ప్రకటించారని అన్నారు. ప్రజలను మోసం చేయడానికే ప్యాకేజీ ఎర వేశారని విమర్శించారు.
వైశ్య ప్రతినిధి సమ్మేళనంలో బుధవారం లాలూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...'మోదీ కొంతమందిని కాదు మొత్తం అందరినీ ఫూల్స్ చేశారు. దేవుడినీ మోసం చేశార'ని అన్నారు. మోదీ తన 15 నెలల పాలనలో ఒక్క హామీయైన అమలు చేసినట్టు ఆధారం చూపించాలని సవాల్ విసిరారు. శాసనసభ ఎన్నికల్లో ఆర్జేడీ-జేడీ(యూ)-కాంగ్రెస్ కూటమి చేతిలో బీజేపీకి ఓటమి తప్పదని దీమా వ్యక్తం చేశారు.