
విదేశీ టూర్లకు డబ్బుంది.. సైనికులకు లేదా!
అమేథీ: వరుస విదేశీ పర్యటనలు చేస్తూ దేశంలో నెలకొన్న సమస్యలను గాలికొదిలేశారని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. 'విదేశీ పర్యటనలు చేసేందుకు మోదీకి కావాల్సినన్నినిధులుంటాయి. అదే సైనికుల సంక్షేమం విషయానికి వస్తేమాత్రం ఒక్కపైసా విదల్చరు' అంటూ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) విధానంపై కేంద్రం తీరును తప్పుబట్టారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం తన సొంత నియోజకవర్గం అమేథీకి వచ్చిన ఆయన పలు గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
'బీహార్ కు 1.25 లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చారు. విదేశీ పర్యటనలకు చాలా ఖర్చుపెడుతున్నారు. వీటితో పోల్చుకుంటే ఓఆర్ఓపీ అమలు పెద్ద కష్టమేమీకాదు. కానీ మోదీ ఆ పని చేయరు. అంత ధైర్యం ఆయనకు లేదు' అని విమర్శించారు.
బీహార్కు భారీ ప్యాకేజీ ప్రకటనను ఎన్నికల ఎత్తుగడగా అభివర్ణించిన రాహుల్.. '2017లో యూపీకి కూడా భారీ ప్యాకేజీ ప్రకటిస్తారేమో! ఎందుకంటే ఆ ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ప్రతి ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రకటనలు చేయడం మోదీకి అలవాటే' అని ఎద్దేవా చేశారు.