
'మోదీవి సిగ్గుమాలిన ప్రకటనలు'
విదేశాలకు వెళ్లినప్పుడు ప్రధాని నరంద్రమోదీ తాను ప్రధాని అనే విషయాన్ని మర్చిపోతున్నారని సీపీఐ ఆరోపించింది.
న్యూఢిల్లీ: విదేశాలకు వెళ్లినప్పుడు ప్రధాని నరంద్రమోదీ తాను ప్రధాని అనే విషయాన్ని మర్చిపోతున్నారని సీపీఐ ఆరోపించింది. పార్లమెంటులో ఎవరి అభిప్రాయం తెలుసుకోకుండానే ఆయన విదేశాల్లో ప్రభుత్వ విధానాలు ప్రకటిస్తున్నారని పేర్కొంది. ప్రస్తుతం నరేంద్రమోదీ న్యూయార్క్లో ఉన్న విషయం వెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా స్పందిస్తూ ప్రధాని చెప్పే మాటలన్నీ కూడా ఖండించదగినవని, సిగ్గుమాలిన ప్రకటనలనీ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
విదేశాలకు వెళ్లిన ప్రతిసారి ఆయన ఇంకా ప్రచారంలోనే మునిగిపోయి ఉన్నట్లుగా కనిపిస్తుందన్నారు. మోదీ లౌకిక వ్యవస్థపై దాడి కొనసాగిస్తున్నట్లుగా ఉందని అందుకు జపాన్ వెళ్లినప్పుడు భగవద్గీత అందించడం, ఐర్లాండ్ పర్యటనలో సంస్కృత శ్లోకాలు వినడంలాంటివన్నీ నిదర్శనాలని చెప్పారు. ఇది భారతీయ గౌరవాన్ని విదేశాల్లో అమ్ముకోవడంలాంటి చర్యలు తప్ప మరొకటి కావని ఆరోపించారు.