
ఆ క్రికెటర్ కొడుకుతో చెస్ ఆడినా..!
సోషల్ మీడియాలో విమర్శల వర్షం
ఈ మధ్య క్రికెటర్లు, సినిమా స్టార్లు ఏం పోస్టు చేసినా.. అయినదానికి కానిదానికి వారికి కించపరిచడం, పరిహాసించడం సోషల్ మీడియాలో సర్వసాధారణంగా మారింది. ముఖ్యంగా మతం పేరిట విమర్శలు చేయడం, కించపరచడం నిత్యకృత్యంగా కనిపిస్తోంది. మొన్నటికిమొన్న భార్యతో దిగిన ఫొటోను పోస్టు చేసినందుకు క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌పై కొందరు మతం పేరిట ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యనమస్కారం చేస్తున్న ఫొటోను పోస్టు చేసినందుకు మరో క్రికెటర్ మహమ్మద్ కైఫ్‌పై పలువురు మండిపడ్డారు. ఇవి తమ మతానికి విరుద్ధమంటూ విద్వేషం వెళ్లగక్కారు.
తాజాగా క్రికెటర్ కైఫ్.. తన కొడుకు చెస్ ఆడుతున్న క్యూట్ ఫొటోను పోస్టు చేసినా.. విమర్శలు తప్పలేదు. ఓ మంచి విషయాన్ని ఆయన షేర్ చేసుకున్నా.. కొందరు మాత్రం మతకోణంలో విపరీత అర్థాలు తీసి విమర్శలు చేశారు. ఇస్లాం మతంలోని నిబంధనలు ప్రస్తావిస్తూ ఆయన తీరును తప్పుబట్టారు. 'ఇస్లాం ప్రకారం చెస్ ఆడటం నిషేధం. నేను మంచి చెస్ ఆటగాడిని కానీ చెస్ ఆడకూడదని హదీత్‌లో చదివిన తర్వాత చెస్ ఆడటం మానేశాను' అని నెటిజన్ అభిప్రాయపడగా.. 'మరోసారి ఖూరాన్' చదవమంటూ మరొకరు కైఫ్‌ను తప్పుబట్టారు. ఈమేరకు ఆయన పోస్టుపై పలు వ్యతిరేక, విద్వేష వ్యాఖ్యలు వెల్లువడ్డాయి. మరోవైపు ఇంకొందరు నెటిజన్లు మాత్రం కైఫ్ చర్యను స్వాగతించారు. ఈ విషయంలో కైఫ్ పోస్టుపై అనుకూల, ప్రతికూల వ్యాఖ్యలు వెల్లువెత్తాయి.