ట్రంప్కు వ్యతిరేకంగా మహిళల నగ్న నిరసన
అమెరికన్లకు ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టలేం. క్లీవ్లాండ్లో వందమందికి పైగా మహిళలు దుస్తులన్నీ విప్పేసి అద్దాలు పట్టుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. వైట్హౌస్లోకి వెళ్లడానికి డోనాల్డ్ ట్రంప్కు ఏమాత్రం అర్హత లేదంటూ వాళ్లీ నిరసన కార్యక్రమం చేపట్టారు. రిపబ్లికన్ పార్టీ తమ అభ్యర్థిగా ట్రంప్ను ప్రకటించే కార్యక్రమం జరగనున్న రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ సభా వేదిక వద్ద వీళ్లంతా చేరి.. ఇలా ప్రదర్శన జరిపారు. స్పెన్సర్ టునిక్ అనే ఫొటోగ్రాఫర్ ఇచ్చిన పిలుపు మేరకు ఇదంతా జరిగింది. సుమారు 130 మంది పాల్గొన్న ఈ నిరసనలో టునిక్ వాళ్లందరినీ ఫొటో షూట్ కూడా చేశాడు. నవంబర్ 8వ తేదీన జరిగే ఎన్నికలకు ముందు వీళ్ల నగ్న నిరసన ఫొటోలను విడుదల చేస్తారు.
నగ్న ప్రదర్శన చేసేందుకు తాము అనుమతి కూడా తీసుకున్నామని టునిక్ చెప్పారు. బహిరంగంగా నగ్న ప్రదర్శన చేయడం క్లీవ్లాండ్ చట్టాల ప్రకారం నేరమే అయినా.. పోలీసులు జోక్యం చేసుకోడానికి కుదరలేదు. నగ్నఫొటోల చిత్రీకరణలో టునిక్ సుప్రసిద్ధుడు. అయితే తాను ఇంతవరకు రాజకీయాలకు సంబంధించి ఏమీ చేయలేదని.. ఇదే చాలా పెద్ద ఎత్తున చేసిన రాజకీయ ఫొటో షూట్ అని ఆయన అంటున్నాడు. తాను తప్పనిసరిగా ఈ షూట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నాడు. నవంబర్లో జరిగే ఎన్నికల్లో ట్రంప్కు వ్యతిరేకంగా ఓట్లు వేసినంత మాత్రాన సరిపోదని, ఇలా నిరసన కూడా తెలపాల్సిందేనని అన్నాడు. తనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారని.. రిపబ్లికన్ పార్టీ పాలనలో మహిళలు, మైనారిటీల మీద జరిగే ఘోరాలను తాను సహించలేనని చెప్పాడు. టునిక్ చర్యలు తనకు నచ్చడం వల్లే ఈ ప్రదర్శనలో పాల్గొన్నట్లు ఆర్ట్ ప్రొఫెసర్, ఆర్టిస్ట్ అయిన మాపో కినార్డ్ (55) అనే మహిళ చెప్పారు. పూర్తి నగ్నంగా రోడ్డుమీద నిలబడటానికి కూడా భయం లేకుండా ఉండటమే తమకు కావాలని ఆమె వివరించారు.