చెప్పినదానికంటే ఎక్కువ పరిహారం
కొత్త భూసేకరణ చట్టానికి సర్కారు సవరణలు
హైదరాబాద్: కొత్త భూసేకరణ చట్టంలో పేర్కొన్న దానికంటే నిర్వాసితులకు ఎక్కువ పరిహారం చెల్లించడానికి వీలుగా సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయడం కోసం ఎక్కువ పరిహారం చెల్లించడానికి అంగీకరించాలంటూ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్(భూసేకరణ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ‘సవరణ’ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కొత్త చట్టంలో సూచించిన సూత్రీకరణకు మించి పరిహారం చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ కల్పించారని, అందుకు అనుగుణంగా సవరణ చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ ఉత్తర్వుల్లోని అంశాలు
► నిర్వాసితులతో జిల్లా కలెక్టర్ చర్చించి, పరస్పర ఆమోదయోగ్యమైన హేతుబద్ధమైన ధర నిర్ణయించాలి.
► {పతిపాదిత ప్యాకేజీ నిర్ణయించడానికి గల కారణాలను వివరిస్తూ జిల్లా కలెక్టర్ నివేదిక పంపించాలి.
► ప్యాకేజీలో భూమి ధర, భూమి కోల్పోతున్న రైతుకు అదనంగా ఇచ్చే పరిహా రం కలిపి ఉండాలి. అందులో ఉండే నిర్మాణాలు, చెట్లు, ఇతర ఆస్తులకు వేరుగా ధర నిర్ణయించి చెల్లించాలి.
► ఆర్ అండ్ బీ, హార్టికల్చర్ తదితర శాఖలతో సంప్రదించి ప్రతిపాదిత ప్యాకేజీలో హేతుబద్ధతను ప్రభుత్వం నిర్ణయిస్తుంది.ప్రభుత్వం ఆమో దం తెలిపిన తర్వాత నిర్వాసితులతో కలెక్టర్ ఒప్పందం కుదుర్చుకోవాలి.