కొడుకును కాపాడి.. కాళ్లు కోల్పోయిన తల్లి
వరంగల్, న్యూస్‌లైన్: తాను రైలు కింద పడిపోతున్న విషయం తెలిసీ.. ఆ తల్లి కన్న బిడ్డ క్షేమాన్ని కోరుకుంది. చివరి నిమిషంలో కొడుకును ప్లాట్‌ఫాంపైకి విసిరి.. తాను మాత్రం రైలుకింద పడి రెండు కాళ్లు కోల్పోయింది. వరంగల్ రైల్వేస్టేషన్‌లో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలోని నెల్లికుదురు మండలం ఆలేరు సమీపంలోని ఇస్రాతండాకు చెందిన బానోతు చిట్టి తన మూడు నెలల బాబుకు వైద్యం చేయించేందుకు బుధవారం వరంగల్‌కు వచ్చింది. మహబూబాబాద్ వెళ్లేందుకు టికెట్ తీసుకొని మూడో నెంబర్ ప్లాట్‌ఫాంపై కూర్చుంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పుష్‌పుల్ రైలు రాగా, అందులో ఎక్కింది. అయితే ఆ రైలు మహబూబాబాద్ వెళ్లదని, హైదరాబాద్‌కు వెళ్తుందని ప్రయాణికులు చెప్పారు.
దీంతో చిట్టి ఒక్కసారిగా ఆయోమయానికి గురైంది. అదే సమయంలో రైలు కదులుతుండగా.. దిగాలనే ఆత్రుతతో చంకలోని బాబుతో సహా ప్రయత్నించింది. అయితే ప్రమాదవశాత్తు ఆమె రైలు కింద పడిపోతున్న క్రమంలో ఒక్కసారిగా బిడ్డ గురించి ఆలోచించింది. తాను ఏమైపోయినా పర్వాలేదు.. బిడ్డ మాత్రం బతకాలనుకుని ప్లాట్‌ఫాంపైకి విసిరేసి.. తాను మాత్రం రైలుకింద చిక్కుకుపోయింది. ఈ సంఘటనలో ఆమె కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన జీఆర్‌పీ పోలీసులు 108లో ఆమెను ఎంజీఎంకు తరలించారు. ఆస్పత్రిలో చిట్టి రెండు కాళ్లు తీసివేయగా, బాబుకు స్వల్పగాయాలయ్యాయి.