'ఆ జీవో ఇచ్చింది చంద్రబాబు చిరకాల మిత్రుడే'
హైదరాబాద్: కరువు సీమ పాలమూరు జిల్లాకు ఎత్తిపోతల పథకం ద్వారా నీరందించే ప్రయత్నాలకు టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన అనుచరులు అడ్డంపడుతున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. కొత్తగా చేపడుతోన్న పాలమూరు ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేనందున వెంటనే నిలిపివేయాలని కోరుతూ సెంట్రల్ వాటర్ కమిషన్ కు చంద్రబాబు లేఖరాయడాన్ని ఆమె తప్పుపట్టారు.
శుక్రవారం తెలంగాణ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. 'పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసింది తన చిరకాల మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డేనన్న సంగతి చంద్రబాబు మర్చిపోయారు. ఈ ప్రాజెక్టుకు అడ్డంపడుతోన్న టీడీపీ నాయకులు.. ఆర్డీఎస్ నుంచి రాయలసీమ గుండాలు నీళ్లు మళ్లించుకుపోయినప్పుడు ఎక్కడికి పోయారు? అంతేకాదు జూరాల నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీటిని మళ్లించుకు పోతుంటే మిన్కకుండి పోతారేం?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలోనూ ఇలాగే పులిచింతల ప్రాజెక్టు కడతానని 10 వేల ఎకరాల పంటభూముల్ని లాక్కున్న చంద్రబాబు ప్రాజెక్టు సంగతిని పూర్తిగా మర్చిపోయి జనాన్ని మోసం చేశారని గుర్తుచేశారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ఈపీసీ విధానాన్ని అమలుచేసి అడ్డగోలు అక్రమాలకు తెరలేపింది బాబేనని విమర్శించారు. కమీషన్ల కోసమే సీఎం కేసీఆర్ ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణాన్ని తుమ్మడిహెగ్టి నుంచి కాళేశ్వరానికి మార్చారన్న కామెట్లను కవిత ఖండిచారు. ఏడాది పొడవునా నీళ్లు నిల్వ ఉండాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ప్రాజెక్టు డిజైన్ లో మార్పులు చేయించారని వివరించారు. పోలవరానికి జాతీయ హోదా వస్తే తెలంగాణకు 30 టీఎంసీల అష్యూర్డ్ వాటర్ లభిస్తుందని, ఆ నీటిని ఇచ్చేందుకు బాబు సిద్ధంగా ఉన్నాడా? అని ప్రశ్నించారు.